మళ్లీ పెరుగుతున్న ముడిచమురు ధరలు.. కొనసాగుతున్న హార్ముజ్ టెన్షన్
ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఈ మార్గం ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావాలంటే అమెరికా తన వైఖరిని మార్చుకోవాలని ఇరాన్ స్పష్టం చేసింది. ఇందుకోసం వాషింగ్టన్ ముందు ఆరు ప్రధాన డిమాండ్లను ఉంచినట్లు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మాజీ కార్యదర్శి, సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ సలహాదారు మొహమ్మద్ బఘేర్ జోల్ఘదర్ వెల్లడించారు.
ఇరాన్ ఆరు ప్రధాన డిమాండ్లు ఇవే..
1. బెదిరింపులు ఆపాలి:
ఇరాన్‌ను ఉద్దేశించి అమెరికా చేస్తున్న బెదిరింపులు, అవమానకర వ్యాఖ్యలను శాశ్వతంగా నిలిపివేయాలని డిమాండ్ చేసింది.
2. ప్రాంతీయ ఘర్షణలకు ముగింపు:
లెబనాన్, పాలస్తీనా, యెమెన్, ఇరాక్ ప్రాంతాల్లో ఇరాన్, దాని మిత్రపక్షాలపై అమెరికా కొనసాగిస్తున్న సైనిక చర్యలను నిలిపివేయాలని కోరింది.
3. నావికా దిగ్బంధనం ఎత్తివేయాలి:
ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమెరికా నావికా, వైమానిక బలగాలను వెనక్కి తీసుకోవడంతో పాటు నావికా దిగ్బంధనాన్ని తొలగించాలని డిమాండ్ చేసింది.
4. యుద్ధ నష్టానికి పరిహారం:
ఇటీవల జరిగిన రెండు యుద్ధాల్లో, ముఖ్యంగా 2025లో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఇరాన్‌కు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి అమెరికా భారీగా పరిహారం చెల్లించాలని పేర్కొంది.
5. ఆర్థిక ఆంక్షలు తొలగించాలి:
ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది.
6. స్తంభింపజేసిన ఆస్తులు విడుదల చేయాలి:
విదేశాల్లో స్తంభింపజేసిన లేదా జప్తు చేసిన ఇరాన్ నిధులు, ఆస్తులను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కోరింది.
ఒమన్‌తో సాంకేతిక ఒప్పందం దిశగా ఇరాన్
ఇదిలా ఉంటే హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకల నిర్వహణ కోసం ఒమన్‌తో సంయుక్త సాంకేతిక ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రతిపాదిత ఒప్పందం అమల్లోకి వస్తే నౌకల రవాణా నిర్వహణలో ఇరాన్, ఒమన్‌లు ఉమ్మడి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
అయితే ఒమన్‌తో సాంకేతిక ఒప్పందం కుదిరినంత మాత్రాన హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకోదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చి స్పష్టం చేశారు. అమెరికా తమ ఆరు రాజకీయ డిమాండ్లను పరిష్కరించినప్పుడే సాధారణ నౌకాయానం పునరుద్ధరించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ముడిచమురు ధరలపై ప్రభావం
పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలిపే హార్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన మార్గం. సుమారు 33 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ జలసంధి ద్వారా రోజుకు దాదాపు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతుందని అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (EIA) అంచనా వేస్తోంది.
ఈ సరఫరాలో సుమారు 82 శాతం ఆసియా దేశాల వైపే వెళ్తుంది. ముఖ్యంగా ఇరాన్ చమురు ఎగుమతుల్లో చైనాకు కీలకమైన వాటా ఉంది.
హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఆందోళన పెరుగుతోంది. సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలపై మార్కెట్లు స్పందించడంతో ముడిచమురు ధరలు మరోసారి పెరుగుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య చర్చలు ఏ దిశగా సాగుతాయన్నదానిపైనే హార్ముజ్ జలసంధి భవిష్యత్ రవాణా పరిస్థితులు, అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రభావం ఆధారపడి ఉంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...