బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తా.. ప్రాణహాని వచ్చినా సిద్ధమే: షేక్ హసీనా సంచలన ప్రకటన. ?

బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తా.. ప్రాణహాని వచ్చినా సిద్ధమే: షేక్ హసీనా సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని, తన పునరాగమనంతో ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ప్రాణాలకు ముప్పు వచ్చినా వెనక్కి తగ్గబోనని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం.
న్యూఢిల్లీలోని ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్, సౌత్ ఏషియా నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో హసీనా తన రాజకీయ ప్రస్థానం, కుటుంబ వారసత్వం, బంగ్లాదేశ్ విమోచన పోరాటం, తన ప్రవాస జీవితం గురించి ప్రస్తావించారు. తన తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ వారసత్వాన్ని ఆమె మరోసారి ముందుకు తెచ్చారు.
1981, 1983, 1985లో తన ప్రవాస జీవితం, అరెస్టులు, 2004లో జరిగిన హత్యాయత్నాన్ని హసీనా గుర్తుచేశారు. 2007లో సైన్య మద్దతుతో ఏర్పడిన కేర్‌టేకర్ ప్రభుత్వం తన బంగ్లాదేశ్ ప్రవేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, ఢాకాకు తిరిగి వచ్చినప్పుడు ప్రజల నుంచి భారీ స్వాగతం లభించిందని పేర్కొన్నారు.
డిసెంబరులో పునరాగమనానికి సంకేతాలా?
రానున్న డిసెంబరులో బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలన్న హసీనా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆమె పునరాగమనం బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర పోటీకి దారితీస్తుందా? లేక ఇప్పటికే ఉన్న రాజకీయ విభేదాలను మరింత తీవ్రతరం చేస్తుందా? అనే చర్చ మొదలైంది.
దీని ప్రభావం అవామీ లీగ్ భవిష్యత్తుపైనే కాకుండా బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలు, భారత్–బంగ్లాదేశ్ సంబంధాలపైనా పడే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
హసీనా మూడు ప్రధాన డిమాండ్లు
హసీనా మూడు కీలక డిమాండ్లను ముందుకు తెచ్చినట్లు సమాచారం.
అవామీ లీగ్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలి.
రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి.
మీడియా స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ స్వతంత్రతను పునరుద్ధరించాలి.
అలాగే 2024 జులై ఉద్యమం వెనుక ప్రణాళికాబద్ధమైన రాజకీయ చర్యలు ఉన్నాయనే వాదనను కూడా ఆమె ప్రస్తావించారు. మహ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలను ఇందుకు ఆధారంగా చూపుతూ, ఉద్యమంపై సమగ్ర న్యాయపరమైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నట్లు సమాచారం.
1971 వారసత్వమే మరోసారి ప్రధాన అంశం
హసీనా వ్యాఖ్యల్లో ప్రధానంగా రెండు రాజకీయ సంకేతాలు కనిపిస్తున్నాయి. మొదటిది—1971 విమోచన యుద్ధ స్ఫూర్తి, అవామీ లీగ్ చారిత్రక వారసత్వాన్ని మళ్లీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం. రెండోది—తన భవిష్యత్ రాజకీయ పునరాగమనానికి అనుకూల వాతావరణాన్ని సిద్ధం చేసుకోవడం.
అయితే ఇదే సమయంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) కూడా 1971 వారసత్వానికి తామే సంరక్షకులమని వాదిస్తోంది. సాయుధ పోరాటానికి జనరల్ జియౌర్ రెహ్మాన్ నాయకత్వం వహించారని, ఆయనే బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ప్రకటన చేశారని BNP వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు, షేక్ ముజిబుర్ రెహ్మాన్ హత్య అనంతరం జియౌర్ రెహ్మాన్ పాలనలో ఇస్లామిక్ రాజకీయాలకు రాజ్యాంగపరమైన స్థానం కల్పించే దిశగా చర్యలు జరిగాయని విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో హసీనా పునరాగమన ప్రకటన బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందా? లేక ఇప్పటికే ఉన్న రాజకీయ విభజనలను మరింత తీవ్రతరం చేస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.