యూఏఈపై మళ్లీ క్షిపణి ముప్పు.. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు నిలిపివేత..!!

యూఏఈపై మళ్లీ క్షిపణి ముప్పు..
ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు నిలిపివేత
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. గల్ఫ్ ప్రాంతంలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)పై ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు యూఏఈ రక్షణ శాఖ వెల్లడించింది. అయితే ఇరాన్ ఈ ఆరోపణలను ఖండించింది…
ఆగస్టు 18న యూఏఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు రెండు క్షిపణులను గుర్తించాయి. ఒక క్షిపణి యూఏఈ ప్రాదేశిక జలాల వెలుపల సముద్రంలో పడగా.. మరో క్షిపణి ప్రాదేశిక జలాల్లో పడినట్లు అధికారులు తెలిపారు. భూభాగంపై ఎలాంటి ప్రభావం లేదని, ప్రాణనష్టం కూడా జరగలేదని వెల్లడించారు…

క్షిపణి ముప్పును గుర్తించిన వెంటనే యూఏఈ అధికారులు ప్రజలకు అత్యవసర మొబైల్ అలర్ట్ జారీ చేశారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. కొద్దిసేపటికే పరిస్థితి అదుపులో ఉందని ప్రకటించి సాధారణ కార్యకలాపాలు కొనసాగించవచ్చని తెలిపారు..
ఈ ఘటనతో ఇరాన్–యూఏఈ సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. తాజా పరిణామాల నేపథ్యంలో యూఏఈ ఇరాన్‌తో అన్ని వాణిజ్య కార్యకలాపాలు, వాణిజ్య మార్పిడి, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేసింది…

మరోవైపు, కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలోనూ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంలో నౌకల రాకపోకలు ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. యూఏఈకి చెందిన ADNOC నౌకలపై దాడులు జరిగాయని అబుదాబి ఆరోపించగా.. ఇరాన్ మాత్రం వాటిపై బాధ్యతను స్వీకరించలేదు…
ఇక అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగిన 60 రోజుల చర్చల గడువు ఆగస్టు 17న ఎలాంటి తుది ఒప్పందం లేకుండానే ముగిసింది. దీంతో మళ్లీ సైనిక ఉద్రిక్తతలు పెరుగుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం యూఏఈలో భద్రతా వ్యవస్థలు అప్రమత్తంగా ఉన్నాయి. మరోవైపు ఇరాన్ మాత్రం యూఏఈపై క్షిపణులు ప్రయోగించిందన్న ఆరోపణలను తిరస్కరిస్తోంది. దీంతో ఈ ఘటనకు అసలు కారణం ఏంటి, తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.