ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల రద్దీ భారీగా

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల రద్దీ భారీగా పెరిగింది. గణపతి నవరాత్రి ఉత్సవాల మొదటి రోజే స్వామివారిని దర్శించుకునేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సమయం గడిచేకొద్దీ ఖైరతాబాద్ పరిసరాల్లో భక్తుల సందడి మరింత పెరుగుతోంది. భక్తుల రాకతో దర్శనానికి ఏర్పాటు చేసిన క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. రద్దీ పెరగడంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వీఐపీ మార్గంలో బ్యారికేడ్లను తొలగిస్తూ, రోప్ పార్టీ సహాయంతో భక్తులను క్రమపద్ధతిలో స్వామివారి దర్శనానికి పంపిస్తున్నారు….

గణేశ్‌ నవరాత్రోత్సవాలకు హైదరాబాద్ పెట్టింది పేరు. అరడుగు ఎత్తు నుంచి అరవై అడుగుల భారీ గణనాథులు కొలువుతీరే భాగ్యనగరంలో పదకొండు రోజుల పాటు పండగే. విభిన్న రూపాల్లో తయారైన ప్రతిమల కొనుగోళ్లు, గల్లీగల్లీలో మండపాల ఏర్పాట్లతో ఎటు చూసినా సందడి వాతావరణమే ఉంటుంది. ఒకటికి మించి మరొకటిలా ఏటా ప్రత్యేకత చాటుకునేలా మండపాల అలంకరణలో యువకులు పోటీ పడుతుంటారు. మరీ ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాలు అనగానే అందరికీ ఖైరతాబాద్‌ మహా గణపతి గుర్తుకొస్తాడు. ఎప్పటికప్పుడు కొత్త అలంకారంతో మహా వైభవంతో భక్తులను ఆకట్టుకుంటున్నాడు.

ఖైరతాబాద్‌లో తొలిసారిగా 1954లో అప్పటి స్వాతంత్య్ర సమరయోధుడు, నాటి కౌన్సిలర్‌ సింగరి శంకరయ్య అనే వ్యక్తి ఒక్క అడుగు విగ్రహంతో అక్కడి స్థానిక లైబ్రరీలో ఉత్సవాలు మొదలుపెట్టారు. తొమ్మిదేళ్లపాటు ఏటా ఒక అడుగు పెంచుకుంటూ 9 అడుగుల వరకు ఆ గదిలోనే నిర్వహించారు. పది అడుగుల విగ్రహం గదిలో ఉంచడం వీలుకాక గ్రంథాలయం ముందు అరుగుపై ఏర్పాటు చేశారు. అనంతర కాలంలో ఎత్తు పెంచుకుంటూ రాగా, 2014లో అది కాస్తా 60 అడుగులకు చేరుకుంది.

70 అనే సంఖ్యను స్థిరంగా

తర్వాత ఏటా ఒక్కో అడుగు తగ్గిస్తూ 40 అడుగుల వద్ద ఖైరతాబాద్ గణేశుడిని స్థిరంగా ఉంచాలని నిర్ణయించారు. ఎత్తు తగ్గించే విషయంలో భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వేడుకలు ప్రారంభించి 70 ఏళ్ల సందర్భంగా అందుకు అనుగుణంగా 70 అడుగుల విగ్రహాన్ని సిద్ధం చేశారు. నాటి నుంచి 70 అనే సంఖ్యను స్థిరంగా ఉంచి నిర్మాణ క్రమంలో ఒక అడుగు తగ్గించడం, ఒక అడుగు పెంచడం వంటివి చేస్తున్నారు. ఈ ఏడాది ఎత్తు 69 అడుగులుగా నిర్ణయించారు. కొవిడ్‌ సమయంలో మాత్రం 11 అడుగుల గణపతినే ఏర్పాటు చేశారు.

ఖైరతాబాద్‌ స్థానిక ప్రజల సమష్టి కృషితోనే ఉత్సవాలు ప్రతి ఏటా విజయవంతం అవుతున్నాయి. 1954లో సింగరి శంకరయ్య ప్రారంభించగా ఆయన తదనంతరం ఆయన సోదరుడు సుదర్శన్‌ బాధ్యతలు చేపట్టారు. సుదర్శన్‌ తర్వాత ఆయన కుమారుడు రాజ్‌కుమార్‌ ఆ బాధ్యతలను తీసుకున్నారు. ఆ కుటుంబానికి సహకారంగా ప్రస్తుతం సందీప్‌రాజ్‌ కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. వేడుకలకు సింగరి కుటుంబం ఛైర్మన్‌గా కొనసాగుతున్నా, స్థానికులందరూ ఇందులో భాగస్వాములవుతారు…

భారీ రూపంలో ఖైరతాబాద్‌ గణపయ్య..
ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం కొత్త రూపంలో గణపయ్యను తీర్చిదిద్దడం ఈ ఉత్సవాల ప్రత్యేకత. భక్తుల విశ్వాసం, కళాకారుల నైపుణ్యం కలగలిసి ఈ మహాగణపతి రూపుదిద్దుకుంటాడు. ఈసారి కూడా భారీ ఆకారంలో రూపొందించిన గణపయ్యను చూసేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విగ్రహ తయారీ పనులు పూర్తి కావడంతో ఉత్సవ సందడి మొదలైంది..