Asian Games 2026.. ఐచిలోని తొకాయ్ సిటిజన్ జిమ్నాషియంలో హోరాహోరీగా జరిగిన ఆసియా క్రీడలు 2026 పురుషుల కబడ్డీ ఫైనల్లో భారత జట్టు 40-34 తేడాతో ఇరాన్‌పై ఘనవిజయం సాధించి తొమ్మిదోసారి ఖండాతర ఛాంపియన్‌గా నిలిచింది. ఆసియా క్రీడల చరిత్రలో ఇప్పటివరకు నిర్వహించిన 10 కబడ్డీ టోర్నీల్లో భారత్‌కు ఇది తొమ్మిదో స్వర్ణ పతకం కావడం విశేషం. కేవలం 2018 జకార్తా ఆసియాడ్స్‌లో మాత్రమే ఇరాన్ విజేతగా నిలువగా, మిగతా అన్ని ఎడిషన్లలోనూ భారత జట్టే ఆధిపత్యం చెలాయించింది.
ఫైనల్ మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్ల డిఫెండర్లు తీవ్రమైన ట్యాకిళ్లతో విరుచుకుపడటంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఒకానొక దశలో భారత్ 7-9 తేడాతో వెనుకబడి, మైదానంలో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఉన్న క్లిష్ట సమయంలో జైదీప్ దహియా.. ఇరాన్ స్టార్ రైడర్ మహమ్మద్రెజా షాద్‌లూయీ చియానేను సూపర్ ట్యాకిల్ చేసి జట్టును ఆదుకున్నాడు. ఆ తర్వాత భారత్ స్వల్ప ఆధిక్యంలోకి వచ్చినప్పటికీ, ఇరాన్ రైడర్ అమీర్ మహమ్మద్ జఫర్ దానేష్ ప్రతిఘటించి రెండు పాయింట్ల రైడ్‌తో భారత్‌ను తొలిసారి ఆల్ ఔట్ చేశాడు. అయినా వెనక్కి తగ్గని భారత్, అర్జున్ దేశ్వాల్ అద్భుత రైడింగ్, షాద్లూయీపై డాషింగ్ ట్యాకిల్‌తో 16-14తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే.. మొదటి భాగం ముగిసే సమయానికి ఇరాన్ ముగ్గురితో సూపర్ ట్యాకిల్ చేసి 18-17తో ఒక పాయింట్ ఆధిక్యంతో హాఫ్ టైమ్‌కు వెళ్లింది. ఇరాన్ జట్టులో జఫర్ దానేష్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
తద్వారా ఆసియా క్రీడల పురుషుల కబడ్డీ చరిత్రలో భారత్ రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పసిడి పతకాన్ని ముద్దాడింది. 1990లో ఆసియా క్రీడల్లో కబడ్డీని ప్రవేశపెట్టినప్పటి నుంచి 2018లో మాత్రమే నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న భారత్, మిగిలిన అన్ని ఎడిషన్లలోనూ స్వర్ణం గెలవడం విశేషం.
ఈ టోర్నీలో భారత పురుషుల జట్టు ఓటమి అనేదే లేకుండా ఫైనల్ చేరింది. సెప్టెంబర్ 21న జరిగిన గ్రూప్-ఎ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్ను 49-24తో ఓడించిన భారత్.. ఆ తర్వాత దక్షిణ కొరియాపై 63-31తో, బంగ్లాదేశ్‌పై 48-25తో, చైనీస్ తైపీపై 37-21 తేడాతో ఘనవిజయాలు సాధించింది.
మహిళల జట్టు నాలుగో స్వర్ణ పతక ఘనత,,
పురుషుల కంటే ముందే బరిలోకి దిగిన భారత మహిళల కబడ్డీ జట్టు సైతం తమ ఆసియా క్రీడల కిరీటాన్ని నిలబెట్టుకుంది. టోకాయ్ సిటిజన్స్ జిమ్నాజియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో పుష్ప రాణా సారథ్యంలోని భారత మహిళల జట్టు 37-34 తేడాతో ఇరాన్‌పై గెలిచి రికార్డు స్థాయిలో నాలుగో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. చివరి నిమిషాల్లో ఇరాన్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ పూజ, సంజు దేవి కీలక రైడ్లతో రాణించి భారత్‌కు విజయాన్ని అందించారు.2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీ ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన ఐదు టోర్నీల్లో భారత్ నాలుగుసార్లు పసిడి గెలిచింది. కేవలం 2018 జకార్తా క్రీడల ఫైనల్లో మాత్రమే ఇరాన్ చేతిలో ఓడింది. భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో చోటు ఆశిస్తున్న కబడ్డీ క్రీడలో భారత్‌కు ఇరాన్ అతిపెద్ద ప్రత్యర్థిగా ఎదిగినప్పటికీ, శనివారం జరిగిన ఫైనల్లో మాత్రం కీలక సమయాల్లో అనుభవలేమితో ఇరాన్ మూల్యం చెల్లించుకుంది. గ్రూప్ దశలోనే ఇరాన్‌ను 37-23తో ఓడించిన భారత అమ్మాయిలు.. ఆ మ్యాచ్‌లో గుర్తించిన ఇరాన్ ఎడమవైపు డిఫెన్స్ బలహీనతను ఫైనల్లోనూ తెలివిగా వాడుకుని బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు.