EMI రూపంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారి..

EMIల రూపంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారి..

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పరిధిలోని 21 అంగన్‌వాడీ కేంద్రాల నుంచి నెలకు రూ.1,000 చొప్పున 3 నెలలకు రూ.63 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దారోజు పద్మ..

అంగన్వాడి కేంద్రాల మీద నెగటివ్ రిపోర్ట్ ఇవ్వకుండా ఉండేందుకు లంచం తీసుకుంటున్నట్టు గుర్తింపు..

లంచాన్ని నెలవారీ వాయిదాల రూపంలో వసూలు చేస్తున్న ఓ ప్రభుత్వ అధికారిణి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

మెట్‌పల్లి చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో)గా పనిచేస్తున్న దారోజు పద్మ, తన పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తుంటారు. అయితే, ఈ తనిఖీల్లో ప్రతికూల నివేదికలు ఇవ్వకుండా ఉండేందుకు గాను, ఆమె పరిధిలోని 21 మంది అంగన్వాడీ సూపర్‌వైజర్ల నుంచి నెలవారీ మామూళ్లు డిమాండ్ చేశారు.

దీని ప్రకారం, ఒక్కో సూపర్‌వైజర్ నెలకు రూ. 1000 చొప్పున ఆమెకు లంచంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో, మూడు నెలలకు సంబంధించిన మొత్తాన్ని ఆమె ఏకమొత్తంగా వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. 21 మంది నుంచి రూ.63,000 లంచం తీసుకుంటుండగా, పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు వలపన్ని ఆమెను పట్టుకున్నారు.

లంచం తీసుకుంటున్న సమయంలో పద్మను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒక ప్రభుత్వ అధికారిణి ఇలా నెలవారీ పద్ధతిలో లంచం వసూలు చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.