అబిడ్స్‌లో కారు బీభత్సం..మహిళకు తీవ్ర గాయలు…!

హైదరాబాద్‌ అబిడ్స్‌లో ఓ నిర్మాతకు చెందిన కారుగా చెబుతున్న వాహనం ప్రమాదానికి గురైన ఘటన కలకలం రేపింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళను కారు ఢీకొనడంతో ఆమె కాలుకు ఫ్రాక్చర్ అయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ప్రమాదం అనంతరం బాధితురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఖర్చులు భరించాలని నిర్మాతలను సంప్రదించినట్లు సమాచారం. అయితే, “డ్రైవర్ నాకు తెలియకుండా కారు తీసుకెళ్లాడు.. మీకు కావాలంటే అతడిపై కేసు వేసుకోండి” అంటూ నిర్మాత స్పందించినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అంతేకాకుండా పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరగడం, ఆసుపత్రి బిల్లులు చెల్లించడం వంటి వ్యవహారాలకు తనకు సమయం లేదని నిర్మాత తప్పించుకునే ప్రయత్నం చేశారని వారు ఆరోపిస్తున్నారు.
అయితే ఈ ఆరోపణలపై నిర్మాత లేదా ఆయన ప్రతినిధుల అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారా? డ్రైవర్ ఎవరు? వాహనం ఎవరి పేరుపై ఉంది? వంటి వివరాలు అధికారికంగా వెల్లడైతేనే పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.