ఎయిరిండియా విమానంలో మరోసారి సాంకేతిక లోపం ..!

కోల్‌కతా: ఎయిరిండియా విమానంలో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టోక్యో నుంచి దిల్లీ రావాల్సిన బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానాన్ని దారి మళ్లించి.. కోల్‌కతా విమానాశ్రయంలో ల్యాండింగ్‌ చేశారు. విమాన కేబిన్‌లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోవడంతో అప్రమత్తమైన పైలట్‌ కోల్‌కతా విమానాశ్రయ అధికారులకు సమాచారమిచ్చి.. సురక్షితంగా ల్యాండింగ్‌ చేశారు. ఈ మేరకు ఎయిరిండియా ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘ టోక్యోలోని హనేడా నుంచి దిల్లీ ప్రయాణిస్తున్న ఏఐ357 విమానంలో లోపం తలెత్తడంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కోల్‌కతా విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేశాం. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి’’ అని ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారిని దిల్లీ చేర్చేందుకు వీలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నామని వెల్లడించింది…