అమెరికా తూర్పు, మధ్య ప్రాంతాల్లో తుపానులు బీభత్సం సృష్టించాయి. ఈ విపత్తు కారణంగా కనీసం 17 మంది మరణించారని అధికారులు తెలిపారు. కెంటకీ, టెనెస్సీ, అలబామా ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ వర్షపాతం, ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేసింది. టెనెస్సీ రాష్ట్రంలో తుపాను అతలాకుతలం చేసింది. ఈ ఒక్క రాష్ట్రంలోనే 10 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
కెంటకీలోని జెఫెర్సన్టౌన్లో టోర్నడో కారణంగా భవనాలు ధ్వంసమయ్యాయని ఓ మీడియా రిపోర్టర్ వెల్లడించారు. సామాజిక మాధ్యమాలు, స్థానిక మీడియాలో షేర్ చేసిన ఫోటోలలో అనేక రాష్ట్రాల్లో తుపాను కారణంగా ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నట్టు కనిపించింది. చెట్లు నేలకూలాయి, విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి… కార్లు బోల్తా పడ్డాయి..