బిహార్లో ఎన్నికల ప్రచారం చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్ష పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ బిహార్లో పారిశ్రామిక కారిడార్ నిర్మించాలని అనుకుంటూ ఉంటే, మహాగఠ్బంధన్ కూటమి మాత్రం చొరబాటుదారుల కోసం కారిడార్ నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు..ఇటీవల రాహుల్ గాంధీ, లాలూ కుమారుడు (తేజస్వి యాదవ్) బిహార్లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టారు. దీని ప్రధాన లక్ష్యం బిహార్లో నివసిస్తున్న పేదలు, దళితులు, ఈబీసీల జీవితాల్లో మార్పు తీసుకురావడం కాదు, కేవలం చొరబాటుదారులను రక్షించడం. వాస్తవానికి ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. ప్రధాని మోదీ ఇక్కడ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని చూస్తుంటే, విపక్షాలు మాత్రం చొరబాటుదారుల కోసం కారిడార్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నాయి.”
– అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
బిహార్లో ఆయుధాగారం
రెండో, చివరి దశ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇదే చివరి రోజు. అందుకే బిహార్లోని ససారాం, అర్వాల్ పట్టణాల్లో అమిత్షా ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీలో మాట్లాడుతూ, భవిష్యత్లో పాకిస్థాన్పై వేసే ప్రతి మోర్టార్ షెల్ను బిహార్లోని ఆయుధ కర్మాగారంలో తయారు చేస్తారని పేర్కొన్నారు. దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపైనా అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఓటు చోరీ జరిగిందని భావిస్తే, ఎన్నికల కమిషన్కు అధికారికంగా ఎందుకు ఫిర్యాదు చేయరు? అని అమిత్ షా ప్రశ్నించారు..