ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారాయి. సనాతన ధర్మంపై ఆమె చేసిన వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అనసూయ హిందూ ధర్మాన్ని అవమానించారంటూ విమర్శలు చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో అనసూయ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన వ్యాఖ్యలను కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారని అన్నారు. తనపై నెగెటివిటీని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఏ మతాన్ని కించపరచలేదని అనసూయ స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని కూడా అవమానించలేదని చెప్పారు..సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు చేసే వారిని ఉద్దేశించే తాను మాట్లాడానని తెలిపారు. బెదిరింపులు, వ్యక్తిగత దాడులకు పాల్పడే వారిపైనే తన వ్యాఖ్యలు అని క్లారిటీ ఇచ్చారు. తన మాటలు ఏ మతానికి వ్యతిరేకం కావని అన్నారు. తాను సనాతన ధర్మాన్ని నమ్మే హిందువునని చెప్పారు. నిజం మాట్లాడటం. అన్యాయాన్ని ప్రశ్నించడం. ఎదుటివారిని మనుషులుగా గౌరవించడం. ఇవే తనకు ధర్మం నేర్పిన విషయాలని అనసూయ పేర్కొన్నారు. తాను సనాతన ధర్మాన్ని భక్తిశ్రద్ధలతో అనుసరిస్తానని అనసూయ తెలిపారు. ఆంజనేయస్వామి తనకు ప్రధాన స్ఫూర్తి అని చెప్పారు.హనుమంతుడు ఇచ్చే ధైర్యం, బలమే అన్యాయం జరిగినప్పుడు మాట్లాడేలా చేస్తుందని అన్నారు. తన వ్యాఖ్యలను అదే కోణంలో చూడాలని కోరారు.
వివాదంలోకి హేమ ఎంట్రీ..
ఈ వివాదంలోకి తాజాగా నటి హేమ ఎంట్రీ ఇచ్చారు. అనసూయ వ్యాఖ్యలపై ఆమె సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. అనసూయను ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు. సోషల్ మీడియా కాలంలో ప్రతి మాటను ప్రజలు గమనిస్తారని అన్నారు. ‘మనమందరం అద్దాల మేడలో బతుకుతున్నాం’అంటూ హేమ తన వ్యాఖ్యలను ప్రారంభించారు. మనం మాట్లాడే ప్రతి మాటను, చేసే ప్రతి పనిని సోషల్ మీడియా భూతద్దంలో చూస్తుందని అన్నారు. ఈ విషయం అనసూయకు తెలియనిది కాదని పేర్కొన్నారు..అనసూయ అప్పుడప్పుడు నోరు జారుతుంటారని హేమ వ్యాఖ్యానించారు. వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత ధర్మం ఎవరి ఇష్టమని అన్నారు. కానీ కోట్లాది మంది ప్రజల విశ్వాసాలకు సంబంధించిన విషయాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరమని సూచించారు. మాటలకు, చేతలకు మధ్య తేడా ఉంటే ప్రజలు వెంటనే గుర్తిస్తారని అన్నారు. జై శ్రీరామ్ అనేది కేవలం స్లోగన్ కాదని అన్నారు. కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయిన మంత్రం అని వ్యాఖ్యానించారు. ఎవరినైనా టార్గెట్ చేయాలనుకుంటే నేరుగా ప్రశ్నించాలని హేమ అన్నారు. కానీ దేవుడి ఫొటోలు పెట్టుకుని మరోలా మాట్లాడటం సరికాదని విమర్శించారు.హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని అన్నారు. అనసూయ మొదటి వీడియోలో ఒకలా మాట్లాడారని హేమ అన్నారు. ఆ తర్వాత మరో వీడియోలో తాను అందరినీ ఉద్దేశించి మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ విషయంలోనే హేమ ప్రశ్నలు సంధించారు. ‘నీకు దమ్ము, ధైర్యం ఉంటే.. వాళ్లు ఎవరో చెప్పు’అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎవరు తనను ఇబ్బంది పెట్టారో అనసూయ స్పష్టంగా చెప్పాలని అన్నారు. అసలు సమస్య ఏమిటో క్లారిటీ ఇవ్వాలని సూచించారు.తెలుగు అభిమానులు ఆమెను ఎంతో ఆదరించారని గుర్తు చేశారు. అభిమానుల ప్రేమతోనే ఆమె ఈ స్థాయికి వచ్చారని పేర్కొన్నారు. అందుకే తెలుగు ప్రజలు, వారి విశ్వాసాల గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని హేమ సూచించారు. ఇలా అనసూయ వ్యాఖ్యలపై హేమ చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదంపై అనసూయ మరోసారి స్పందిస్తారా? హేమ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తారా? అనేది ఆసక్తిగా మారింది..