ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల…!

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు(బుధవారం) ఉదయం మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదు అయ్యింది. గత 12 ఏళ్లలో అత్యధికంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 77 శాతం పాస్ అయ్యారు. రెండో సంవత్సరం విద్యార్థులు 81 శాతం పాస్‌తో రెండో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ‘Hi’ మెసేజ్‌ను 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో పంపితే కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి..

ఇంటర్ ఫస్టియర్‌లో 5,10,307 మంది, సెకండియర్‌లో 5,05,609 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో ప్రథమ సంవత్సరంలో 77 శాతం, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత 12 సంవత్సరాల్లో ఎన్నడూలేని విధంగా అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించారని నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.

కాగా, ఏపీ ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఈ జిల్లాలో 92 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత గుంటూరులో 88 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 87 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇక అన్నమయ్య జిల్లాలో అత్యల్ప ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఈ జిల్లాలో కేవలం 62 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.

మే 21 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21వ తేదీన ప్రారంభం కానున్నాయి. జూన్ 4వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఇంటర్ ప్రాక్టికల్స్ జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగుతాయి.