ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు రోజులు pమాత్రమే మిగిలి ఉన్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (BJP) గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు..ఒకవైపు ప్రచారాన్ని ఉధృతం చేస్తూనే.. మరోవైపు హామీల వర్షంతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం కొనసాగుతోంది. అయితే.. ఈ ఎన్నికల ముందు ఆప్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలకి కేవలం ఐదు రోజులు ముందే, ఆప్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో పార్టీ శిబిరంలో అసంతృప్తి రేగుతోంది. ఈ రాజీనామాల వెనుక రాజకీయ కుట్ర ఉందా..? లేక పార్టీపై అసంతృప్తే కారణమా..? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
అధికార పార్టీకి చెందిన ఈ ఐదుగురు కీలక ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఎన్నికల సమీకరణాలను గందరగోళానికి గురి చేస్తోంది. వీరి రాజీనామాలపై ఇంకా అధికారిక సమాచారం వెలువడనప్పటికీ, ఈ పరిస్థితి ఆప్‌కు భారీ పతనాన్ని తెచ్చిపెట్టే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లే అవకాశముందా..? లేక విపక్షాల్లో మరో పార్టీలో చేరతారా? అనే అంశం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. బీజేపీ ఇప్పటికే ఆప్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ.. ప్రజల మద్దతును ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తోంది.
ఢిల్లీ ఎన్నికలపై ప్రభావం..
ఈ రాజీనామాలు ఎన్నికలపై ఎంతటి ప్రభావం చూపుతాయనేది కీలకం. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ ప్రభుత్వం తన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశేష ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఎన్నికల ముందు ఇలా కీలక ఎమ్మెల్యేలు వైదొలగడం ఆప్‌కు భారీ షాక్ ఇచ్చినట్లే. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో ఆప్ పార్టీ ఎలా స్పందిస్తుంది..? ప్రజల మద్దతును ఎలా కాపాడుకుంటుంది..? అనేది వేచి చూడాలి. ఢిల్లీ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారినట్లు కనిపిస్తోంది..