జపాన్‌లోని నగోయా వేదికగా ఆసియా క్రీడల 20వ ఎడిషన్ ప్రారంభమైంది. తొలి రోజు అనేకమంది అథ్లెట్లు భారత్ తరపున ఆయా క్రీడల్లో బరిలోకి దిగారు. ఈ క్రమంలో మొదటిరోజే భారత్ పతకాల ఖాతాను తెరిచింది. షూటింగ్ విభాగం టీమ్ ఈవెంట్లో భారత్‌కు తొలి పతకం అందింది. ఆ తర్వాత అదే విభాగం వ్యక్తిగత ఈవెంట్లోనూ మెడల్ భారత్ ఖాతాలో చేరింది. వీటితోపాటు వివిధ పోటీల్లో మన అథ్లెట్లు అంచనాలను మించిన ప్రదర్శనలు, చివరి నిమిషంలో దక్కిన విజయాలు, ఊహించని ఫలితాలతో తొలి రోజు ఉత్కంఠభరితంగా సాగింది.
ఎలావెనిల్ అద్భుతం- షూటింగ్‌లోనే రెండు పతకాలు
భారత షూటర్ ఎలావెనిల్ వలవరిన్ ఆసియా క్రీడల్లో అద్భుతమే చేసింది. తొలుత మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఆమె రజత పతకాన్ని ముద్దాడింది. ఎలావెనిల్తోపాటు ఈ టీమ్‌లో సోనం, విదర్శ వినోద్ త్రయం రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలోనూ ఆమె సత్తా చాటింది. 10 మీటర్ల రైఫిల్ విభాగంలో ఎలావెనిల్ రెండో ప్లేస్ సాధించి రజతం అందుకుంది.
షూటింగ్లో రెండు రజతాలతో పతకాల బోణీ..
Asian Games 2026
ఇండియాకు తొలి పతకం షూటింగ్ విభాగంలో లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఎలావెనిల్ వలరివన్, సోనమ్ ఉత్తమ్ మస్కర్, విదర్శ కె. వినోద్‌ల త్రయం 1898.0 స్కోరు సాధించి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. చైనా స్వర్ణం గెలుచుకోగా, జపాన్ కాంస్యం గెలుచుకుంది. ఆ తర్వాత స్టార్ షూటర్ ఎలావెనిల్ వలరివన్ వ్యక్తిగత ఈవెంట్లో రాణించారు. హోరాహోరీగా జరిగిన రేసులో ఆమె కేవలం 0.6 పాయింట్ల తేడాతో స్వర్ణ పతకాన్ని కోల్పోయి, 252.4 స్కోరుతో రెండో రజత పతకాన్ని గెలుచుకున్నారు. జపాన్‌కు చెందిన హినాటా తైచి (253.0) స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. వ్యక్తిగత ఫైనల్లో సోనమ్ మస్కర్ ఆరో స్థానంలో నిలిచారు. దేశానికి గౌరవాన్ని తెచ్చిపెట్టినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము షూటర్లను అభినందించారు.
ఫైనల్‌కు మహిళల క్రికెట్ జట్టు..
భారత మహిళల క్రికెట్ జట్టు సెమీ-ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌ను క్లీన్ స్వీప్ చేసి ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ విజయంతో భారత్ ఇప్పటికే రజత పతకాన్ని ఖాయం చేసుకుంది. షఫాలీ వర్మ కేవలం 49 బంతుల్లోనే తొమ్మిది సిక్సర్లు, మూడు ఫోర్లతో అజేయంగా 100 పరుగులు సాధించింది. ఆసియా క్రీడల క్రికెట్ చరిత్రలో ఓ భారత మహిళా బ్యాటర్ సాధించిన తొలి సెంచరీ ఇది. భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. దీనికి సమాధానంగా బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో కేవలం 81 పరుగులకే ఆలౌట్ అయింది. నందిని శర్మ, దీప్తి శర్మ చెరో మూడు వికెట్లు తీయగా, శ్రీ చరణి రెండు వికెట్లు పడగొట్టింది. భారత్ సెప్టెంబర్ 22న జరిగే స్వర్ణ పతక మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది.
హాకీ, బ్యాడ్మింటన్‌లో భారత జట్ల రికార్డు విజయాలు
భారత మహిళల జట్టు ఉజ్బెకిస్తాన్ను 19-0 భారీ తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. పురుషుల జట్టు కూడా తమ తొలి మ్యాచ్‌లో ఇండోనేషియాను 13-1 తేడాతో ఓడించింది. దిల్‌ప్రీత్ సింగ్ అద్భుతంగా నాలుగు గోల్స్ చేయగా, సుఖ్జీత్ సింగ్ రెండు గోల్స్ చేశాడు. తొలి రౌండ్లో మహిళల బ్యాడ్మింటన్ జట్టు కజకిస్థాన్‌ను కేవలం 90 నిమిషాల్లో 3-0 తేడాతో ఓడించింది. పీవీ సింధు కేవలం 24 నిమిషాల్లో కమీలాను 21-7, 21-9 తేడాతో ఓడించింది. ఉన్నతి హూడా అలిస్సాను 21-7, 21-19 తేడాతో ఓడించింది.
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, వుషులో ఏమి జరిగింది
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మహిళల 60 కేజీల సాంప్రదాయ విభాగంలో సుచిక తరియాల్ మంగోలియాకు చెందిన బైగల్మాను 2-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి భారతదేశానికి మరో పతకాన్ని ఖాయం చేసింది. నగోయాలో వసతి ఏర్పాట్లలో 10 గంటల ఆలస్యం కారణంగా తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురైన పురుషుల ఎంఎంఏ ఫైటర్ వరుణ్ సన్యాల్ అనర్హతకు గురయ్యాడు. వుషులో, చాంగ్చువాన్ ఫైనల్లో సూరజ్ సింగ్ మయాంగ్లాంబమ్ 11వ స్థానంలో నిలిచాడు. 75 కేజీల విభాగంలో రౌండ్ ఆఫ్ 16లో విక్రాంత్ బలియాన్, ఇరాన్‌కు చెందిన సోహెల్ మౌసావి చేతిలో 0-2 తేడాతో ఓడిపోయాడు.