కన్నుల పండగగా భద్రాది రామయ్య కళ్యాణ మహోత్సవం..

దక్షిణ అయోధ్యగా పిలవబడే భద్రాచలం పుణ్యక్షేత్రం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గోదావరి తీరాన వెలసిన ఈ దివ్యధామం, విద్యుత్ దీపాల అలంకరణలతో దేదీప్యమానంగా వెలుగుతోంది. స్వామివారి కళ్యాణ వేడుకలను కళ్లారా వీక్షించేందుకు భక్తులు దేశం నలుమూలల నుండి భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు, మాడ వీధులు జనసంద్రమయ్యాయి. భక్తుల సౌకర్యార్థం అధికారులు ఎండ వేడి నుండి ఉపశమనం కలిగించేలా చలువ పందిళ్లు, మంచినీటి వసతులు కల్పించి, క్యూలైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి ఇల్లు సుఖసంతోషాలతో విరాజిల్లాలని ఆయన ఆకాంక్షించారు. భద్రాద్రి రామాలయ విశిష్టతను చాటిచెప్పేలా, ఆలయ సమగ్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం రూ. 351 కోట్లతో మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసిందని ఈ సందర్భంగా ప్రకటించారు. భక్తులకు కల్పించే వసతుల విషయంలో రాజీ పడకూడదని, అత్యుత్తమ ఏర్పాట్లతో వేడుకలను నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు…