రిజిస్ట్రేషన్ పని వేళలను పెంచిన తెలంగాణ ప్రభుత్వం..

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల రద్దీ పెరిగింది. దీంతో రిజిస్ట్రేషన్ల పని వేళలను ప్రభుత్వం పెంచింది. ఈ నెల 28, 30, 31 తేదీలలో అన్ని కార్యాలయాలు ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు నిరంతరాయంగా పనిచేస్తాయి. ఈ మూడు రోజుల పాటు సబ్ రిజిస్ట్రార్లు, కార్యాలయ సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోకూడదని ఉన్నతాధికారులు ఆదేశించారు..

స్లాట్ల సంఖ్య పెంపు..

ఆర్థిక సంవత్సరం చివరిలో ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దీనివల్ల స్లాట్లు దొరకక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. దీనిని పరిష్కరించడానికి ప్రభుత్వం స్లాట్ల సంఖ్యను కూడా పెంచింది. ప్రజలు తమకు వీలైన సమయంలో స్లాట్ బుక్ చేసుకుని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

సిబ్బందికి కఠిన ఆదేశాలు..

ఈ మూడు రోజుల పాటు (మార్చి 28, 30, 31) సబ్ రిజిస్ట్రార్లు, కార్యాలయ సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోకూడదని ఉన్నతాధికారులు ఆదేశించారు. పెరిగిన పని వేళలకు అనుగుణంగా సిబ్బంది అందుబాటులో ఉండి, ప్రజలకు సేవలు అందించాలని స్పష్టం చేశారు. జిల్లా రిజిస్ట్రార్లు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఈ మార్పుల గురించి స్థానిక ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సామాన్య ఇల్లు లేదా భూమి కొనుగోలుదారులకు ఎంతో ఊరట లభించనుంది. మార్చి 31లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలనుకునే వారు ఈ పొడిగించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.