చెన్నైలో జరిగేది మాఫియా ముఠాల సమావేశం…. బండి సంజయ్..

గత పదేళ్లలో తెలంగాణలో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay) విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలోనూ రైతులను ఆదుకున్న దాఖలాలు లేవని చెప్పారు…ప్రస్తుతం వడగళ్ల వానతో నష్టోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. గతంలో సమీక్షలు, సర్వేలు, నివేదికల పేరుతో కాలం గడిపారన్నారు. సర్వే చేసి వారం రోజుల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలిపారు.

”డీలిమిటేషన్‌పై కలిసిన వారంతా దొంగల ముఠానే. భారాస, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ ఒక్కటే. కేసుల నుంచి తప్పించుకునేందుకు భారాసకు కాంగ్రెస్‌ సహకరిస్తోంది. దిల్లీలో కలిసి ఉంటారు.. గల్లీలో కొట్లాడుకుంటారు. డీఎంకే భేటీకి రెండు పార్టీలు వెళ్లాయంటే.. ఇద్దరూ ఒక్కటా?కాదా? కేసుల విషయంలో కేసీఆర్‌ కుటుంబానికి ఒక్క నోటీసు కూడా ఇవ్వట్లేదు. భాజపాకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడుతున్నారు.

డీలిమిటేషన్‌ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఆరు గ్యారంటీల హామీల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్‌ యత్నిస్తోంది. తమిళనాడులో డీఎంకే రూ.వెయ్యి కోట్ల మద్యం కుంభకోణం చేసింది. డీఎంకేను సాగనంపేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు పక్కా ప్రణాళికతో ఇదంతా చేస్తున్నారు. దక్షిణాదిలో సీట్ల సంఖ్య తగ్గించబోమని అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. డీలిమిటేషన్‌కు ఎలాంటి నియమ నిబంధనలు పెట్టలేదని చెప్పారు. చెన్నైలో జరిగేది మాఫియా ముఠాల సమావేశం. అవినీతి, స్కామ్‌ పార్టీలు కలిసి భాజపాను అప్రతిష్ఠ పాలు చేసేందుకు యత్నిస్తున్నాయి.” అని బండి సంజయ్‌ మండిపడ్డారు.