Bangladesh.. బంగ్లాదేశ్ లో మరో దారుణ ఘటన. హిందువులపై కక్ష సాధింపు..చనిపోయిన తల్లిని చూడనివ్వకుండా..!

బతికున్నప్పుడు కొడుకును ఒక్కసారి చూడాలన్న తల్లి కోరిక తీరలేదు.. చివరికి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మాత్రమే కుమారుడికి అవకాశం..
ఐదు గంటల పెరోల్ ముగియగానే తిరిగి జైలుకు పయనం..

ఒక తల్లి చివరి కోరిక అది.. తన కొడుకును ఒక్కసారి చూడాలి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా.. చివరి క్షణాల్లో కొడుకు ముఖం చూసి కన్నుమూయాలనుకుంది. కానీ ఆ కోరిక నెరవేరలేదు. కొడుకు జైలు గోడల మధ్య ఉండగా.. ఆ తల్లి కన్నుమూసింది. చివరకు తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఐదు గంటల పాటు మాత్రమే కుమారుడికి పెరోల్ లభించింది. ఆ ఐదు గంటల సమయం ముగియగానే.. కన్నీళ్లతో తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌లో హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ విషయంలో అక్కడి విద్వేష మైనార్టీ హిందూ వ్యతిరేక ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపై ఇప్పుడు భారత్ లోని హిందువుల్లో ఆగ్రహజ్వాలలు చెలరేగుతున్నాయి. ఈ ఘటన భారతీయులు, బంగ్లాదేశ్ లోని హిందువులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది.

తల్లిని చూడాలనుకుంది.. కానీ కోరిక తీరలేదు

బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగరణ్ జోట్ అధికార ప్రతినిధిగా ఉన్న చిన్మయ్ కృష్ణ దాస్‌ 2024 నవంబర్‌లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయ్యారు. జాతీయ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. ఈ సమయంలో ఆయన తల్లి సంధ్యా రాణి ధర్ (71) అనారోగ్యంతో బాధపడుతున్నారు. క్యాన్సర్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఆమెను తీవ్రంగా వేధించాయి. ఛటోగ్రామ్‌లోని హఠాజారి ఆశ్రమంలో చికిత్స పొందుతూ చివరకు గురువారం కన్నుమూశారు. అయితే.. తన కుమారుడిని ఒక్కసారి చూడాలన్న ఆమె కోరిక మాత్రం తీరకుండానే ప్రాణాలు విడిచారు. తల్లి అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆమెను చూసేందుకు చిన్మయ్ కృష్ణ దాస్‌కు పెరోల్ ఇవ్వాలని కుటుంబ సభ్యులు అధికారులను కోరారు. అయితే అనారోగ్యంతో ఉన్న బంధువును చూసేందుకు ఖైదీని విడుదల చేసే నిబంధన లేదంటూ ఆ అభ్యర్థన తిరస్కరణకు గురైంది.