లెబనాన్‌లో ఇజ్రాయెల్ భారీ విధ్వంసం.. కృత్రిమ భూకంపం సృష్టించిన ఇజ్రాయిల్.. 4.1 తీవ్రతతో దద్దరిల్లిన భూమి..!

లెబనాన్ లోని వ్యూహాత్మక ప్రాంతమైన
‘అలీ అల్-తాహెర్’ పర్వత శ్రేణి కింద ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా నిర్మించిన ప్రధాన సొరంగ మార్గాలను ఇజ్రాయెల్ సైన్యం అత్యంత శక్తివంతమైన పేలుళ్లతో ధ్వంసం చేసింది..ఈ విధ్వంసం ఎంత శక్తివంతంగా జరిగిందంటే.. పరిసర ప్రాంతాల్లో ఈ పేలుడు తీవ్రతకు రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో కృత్రిమ భూకంపం నమోదైంది..
https://x.com/i/status/2098145275718054119
1,100 టన్నుల పేలుడు పదార్థాలు

యూఎస్ జియోలాజికల్ సర్వే, లెబనీస్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. నబాతీయే సమీపంలో 4.1 తీవ్రతతో భూకంప ప్రకంపనలు రికార్డయ్యాయి. ఇది సహజమైన భూకంపం కాదని, ఉపరితలం కింద ఉన్న సొరంగాలను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం దాదాపు 1,100 టన్నుల భారీ పేలుడు పదార్థాలను ఉపయోగించడం వల్లే సంభవించిన కృత్రిమ భూకంపం అని సైంటిస్టులు స్పష్టం చేశారు. పర్వతాల కింద నిర్మించిన రెండు కిలోమీటర్లకు పైగా పొడవైన సొరంగాలతో పాటు ఆయుధ డిపోలు, కమాండ్ సెంటర్లను పూర్తిగా నాశనం చేసినట్లు ఇజ్రాయెల్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పేలుడు తీవ్రతకు రాత్రి వేళ ఆకాశంలోకి భారీ అగ్ని గోళం ఎగిసిపడింది. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ పంచుకున్నారు..
వ్యూహాత్మక ఆధిక్యం

హిజ్బుల్లాకు చెందిన బదర్ విభాగానికి ఈ భూగర్భ నెట్వర్క్ ప్రధాన కమాండ్ సెంటర్‌గా పనిచేస్తోందని ఇజ్రాయెల్ వెల్లడించింది. 5.4 కిలోమీటర్లకు పైగా విస్తరించిన ఈ భారీ ప్రాంగణంలో దాదాపు 8 భూగర్భ మార్గాలు, ఆయుధ డిపోలు, రాకెట్లు, డ్రోన్లు, యాంటీ-ట్యాంక్ మిస్సైళ్లు, కమాండ్ సెంటర్లు ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ.. ఇరాన్ నిధులతో గత రెండు దశాబ్ధాలుగా నిర్మించిన ఈ వ్యూహాత్మక స్థావరాన్ని ధ్వంసం చేయడం ద్వారా దక్షిణ లెబనాన్‌లో సెక్యూరిటీ జోన్ పై పూర్తి నియంత్రణ సాధించామని వెల్లడించారు.

తీవ్ర ప్రకంపనలు.. స్థానికుల్లో భయాందోళనలు

ఈ భారీ పేలుళ్ల ధాటికి దక్షిణ లెబనాన్ మొత్తంలో భూమి తీవ్రంగా కంపించింది. ఈ పేలుళ్ల ధాటికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీడాన్ నగరం వరకు ప్రజలు భయందోళనకు గురయ్యారు. ముఖ్యంగా భూకంప ప్రభావం ఉన్న రూమ్ ఫాల్ట్ లైన్ కు సమీపంలో ఈ భారీ పేలుడు జరగడం పట్ల స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధ్వంసం ప్రాంతీయ రక్షణ భద్రతను మరింత సవాలుగా మార్చిందని లెబనాన్ వర్గాలు పేర్కొన్నాయి.