బాపట్ల : సర్కార్ ఎక్స్ప్రెస్ లో దోపిడీ దొంగలు చోరీ..!

*బాపట్ల : సర్కార్ ఎక్స్ప్రెస్ లో దోపిడీ దొంగలు చోరీ..!*

*చంగల్పట్టు నుంచి కాకినాడ వెళుతున్న రైలులో చోరీ.. ప్రయాణికుల నుంచి 5తులాల బంగారు ఆభరణాలు లాకెళ్లిన దొంగలు.*

*దోపిడీని ప్రతిఘటించి కేకలు వేసిన ప్రయాణికులు.. చైన్ లాగి రైలు ఆగగానే పరారైన దొంగలు.*

*దొంగలపై కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు.

రైళ్లలో ప్రయాణికుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. తమిళనాడులోని చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్ట్‌కు వెళుతున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు చోరీకి పాల్పడడం కలకలం రేపింది. బాపట్ల శివారు నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో జరిగిన ఈ ఘటనలో నిద్రిస్తున్న మహిళల మెడల నుంచి బంగారు ఆభరణాలను అపహరించి పరారయ్యారు.

నిద్రలోనే నగల అపహరణ : రాత్రి 1.15 గంటల సమయంలో ఎస్-3, ఎస్-6 బోగీల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళల నుంచి సుమారు ఏడు సవర్ల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లారు. బాధితులు గమనించడంతో చైన్ లాగి రైలును నిలిపివేశారు. అప్పటికే దొంగలు రైలు దిగి పొలాల మార్గంలో బాపట్ల-గుంటూరు రహదారి వైపు పారిపోయారు.

ఆరుగురు ముఠా సభ్యులపై అనుమానం : రైలులో ఎస్కార్ట్ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమై దుండగులను వెంబడించారు. పారిపోతున్న వారిని ఆపేందుకు మొత్తం తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపారు. అయినప్పటికీ నిందితులు చీకటిని ఆసరాగా చేసుకుని తప్పించుకున్నట్లు సమాచారం. అప్పికట్ల-బత్తిపూడి గ్రామాల పరిసర పొలాల్లో పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు.ఈ ఘటనలో ఆరుగురు సభ్యులతో కూడిన దొంగల ముఠా పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు గ్రామీణ పోలీసులను అప్రమత్తం చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా విచారణ కొనసాగిస్తున్నారు..