పువ్వుల ద్వారా దేవుడు పూజించటం ఎక్కడైనా జరుగుతుంది.. కానీ పువ్వుల్ని పూజించడం కేవలం తెలంగాణలోనే అది కూడా బతకమ్మ పండుగ వేడుకల్లోనే చూస్తాం..
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ, తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు.
శివుడు లేని పార్వతి గురించి పాటలగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు. బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ.
పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది.
9 రోజులపాటు ప్రతిరోజూ ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు..
తెలంగాణ ప్రాంత వాసులు ఆశ్వయుజ మాసంలో జరుపుకునే అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. దసరా పండుగను దేశవ్యాప్తంగా వారి వారి సంస్కృతి ప్రకారం జరుపుకుంటారు. కానీ తెలంగాణాలో మాత్రం దసరా పండుగను బతుకమ్మ పండుగగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి? ఈ పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు? తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన ఈ బతుకమ్మ పండుగ గురించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
దేవి నవరాత్రుల మాదిరిగానే బతుకమ్మ పండుగ కూడా!.
బతుకమ్మ పండుగ తెలంగాణాలో భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. తెలంగాణకు మాత్రమే పరిమితమైన ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. సాధారణంగా మనం ఒక పండుగ జరుపుకునే ముందు ఆ పండుగ ఎందుకు జరుపుకుంటాం? దాని వెనుక ఉన్న విశేషాలేమిటి అని పూర్తిగా తెలుసుకొని పండుగను జరుపుకుంటే ఆ పండుగ ఉత్సవాలను పూర్తిగా ఆనందించవచ్చు.
బతుకమ్మ పండుగ ఎలా జరుపుకుంటారు?
తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ రోజుల్లో మహిళలు, అమ్మాయిలు రంగు రంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి, బతుకమ్మను తయారు చేస్తారు. ఆ తరువాత అలంకరించిన ఆ బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. ఈ బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి.
వేడుకలు ఎప్పుడు ప్రారంభం?
సెప్టెంబర్ 21 వ తేదీ భాద్రపద బహుళ అమావాస్య అంటే మహాలయ అమావాస్య నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు దేవి నవరాత్రుల్లో ఎనిమిదో రోజు అంటే దుర్గాష్టమి పర్వదినంతో ముగుస్తాయి. ఈ ఏడాది అష్టమి, నవమి తిథులు ఒకే రోజు వచ్చినందున బతుకమ్మ ముగింపు వేడుకలు అక్టోబర్ 1 వ తేదీన జరుగనున్నాయి. అయితే ఒక్కోసారి ఈ ముగింపు వేడుకలు వారి వారి సంప్రదాయం ప్రకారం ఒకరోజు ముందు వెనుక మారుతుంటాయి. ఈ సందర్భంగా బతుకమ్మను ఏ రోజు ఏ పేరుతో పూజిస్తారో చూద్దాం.
పాడ్యమి రోజు- ఎంగిలి పూల బతుకమ్మ:
బతుకమ్మ వేడుకల్లో మొదటి రోజైన మహాలయ అమావాస్య. ఈ రోజును తెలంగాణలో ‘పెత్రామాస’ అని కూడా అంటారు. ఈ రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా పూజించి నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు నివేదిస్తారు.
విదియ రోజు- అటుకుల బతుకమ్మ : బతుకమ్మ వేడుకల్లో రెండో రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజు అమ్మవారికి సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
తదియ రోజు- ముద్దపప్పు బతుకమ్మ : బతుకమ్మ వేడుకల్లో మూడో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజు అమ్మవారికి ముద్ద పప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
చవితి రోజు- నానే బియ్యం బతుకమ్మ : బతుకమ్మ వేడుకల్లో నాలుగో రోజు బతుకమ్మను నానే బియ్యం బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజు అమ్మవారికి నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
పంచమి రోజు-అట్ల బతుకమ్మ : బతుకమ్మ వేడుకల్లో ఐదో రోజు బతుకమ్మను అట్ల బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజు అమ్మవారికి అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు.
షష్ఠి రోజు- అలిగిన బతుకమ్మ : బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజున అమ్మవారు అలిగి ఉంటారని, అందుకే ఏమి తినరని నమ్మకం. అందుకే ఈ రోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టరు.
సప్తమి రోజు-వేపకాయల బతుకమ్మ : బతుకమ్మ వేడుకల్లో ఏడో రోజు బతుకమ్మను వేపకాయల బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజు వేయించిన బియ్యంపిండితో వేపపండ్లు ఆకారంలో తయారు చేసి వాటినే అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
అష్టమి ఎనిమిదో రోజు- వెన్నముద్దల బతుకమ్మ : బతుకమ్మ వేడుకల్లో ఎనిమిదో రోజు బతుకమ్మను వెన్న ముద్దల బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజు అమ్మవారికి నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు.
నవమి తొమ్మిదో రోజు-సద్దుల బతుకమ్మ : బతుకమ్మ వేడుకల్లో తొమ్మిదో రోజు దుర్గాష్టమి మహా పర్వదినం రోజున బతుకమ్మను సద్దుల బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజు బతుకమ్మకు పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం, ఇలా అయిదు రకాల నైవేద్యాలను నివేదిస్తారు.
అంబరాన్నంటే బతుకమ్మ సంబరాలు
బతుకమ్మ సంబరాలు తెలంగాణాలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకల సందర్భంగా ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని పండుగ సంబరాలు జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజుల్లో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేస్తారు. చివరగా తమ సమీపంలో ఉన్న చెరువుల్లో కానీ, నదుల్లో కానీ బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.
ముగింపు వేడుకలు ఇలా!
బతుకమ్మ వేడుకల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మ పండుగ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళ లోనికి పోయి తంగేడు, గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత కుటుంబ సభ్యులంతా కలిసి ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో!
చీకటి పడే సమయంలో స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న చెరువు వద్దకు ఊరేగింపుగా బయలుదేరుతారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు.
తెలంగాణా రాష్ట్ర పండుగ
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత బతుకమ్మ పండుగకు ప్రాముఖ్యత పెరిగింది. ఇప్పుడు మన దేశంతో పాటు విదేశాల్లో కూడా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలను మనం కూడా ఆనందంగా జరుపుకుందాం! మన సంస్కృతీ సంప్రదాయాలను దేశవిదేశాల్లో చాటుదాం!
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం..