ఓ టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న ఆడ పులి.. అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. 21 రోజుల్లో మూడు రాష్ట్రాల్లో 300 కిలోమీటర్ల మేర ప్రయాణించి..ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్లో చిక్కింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని తడోబా- అంధారి టైగర్ రిజర్వ్ నుంచి మూడేళ్ల వయసున్న ఓ ఆడ పులి(Zeenat)ని ఇటీవల ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్‌కు తరలించారు. అయితే, డిసెంబరు 8న ఆ పులి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకుని.. పొరుగు రాష్ట్రమైన ఝార్ఖండ్‌లోకి ప్రవేశించింది…ఒక వారం పాటు ఝార్ఖండ్‌లో సంచరించి.. అనంతరం పశ్చిమ బెంగాల్‌లోని ఝార్గ్రామ్లోకి అడుగుపెట్టింది. ఆ పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఆదివారం ఫలించాయి. బంకురా జిల్లాలోని గోసైందిహి ప్రాంతంలో మత్తు మందు ఇచ్చి దాన్ని బంధించారు. పులిని పట్టుకోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. టీం వర్క్, వన్యప్రాణుల సంరక్షణ పట్ల అంకితభావానికి ఈ ఘటన ఉదాహరణ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగమైన సిబ్బందికి అభినందనలు తెలిపారు…ఆశ్రమంలోకి చొరబడి.. బాత్రూంలో చిక్కుకుపోయి..!
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన హరిద్వార్‌లో ఓ చిరుత కలకలం రేపింది. స్థానికంగా ఓ ఆశ్రమంలోకి చొరబడటంతో అక్కడున్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదారేళ్ల వయసున్న ఓ చిరుత ఆదివారం హరిద్వార్‌లోని మానవ్కల్యాణ్ ఆశ్రమంలోకి చొరబడింది. ఈ క్రమంలోనే అక్కడున్న బాత్రూమ్లో చిక్కుకుపోయింది. ఈమేరకు సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఏడు గంటలపాటు శ్రమించి.. ఎట్టకేలకు దాన్ని బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు..