ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధించాలి.. తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు..

సోషల్ మీడియా వినియోగం పిల్లల మానసిక స్థితిపై చూపుతున్న ప్రభావం , వారి డేటా భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో లోక్‌సభలో ఒక కీలకమైన ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోషల్ మీడియా నియంత్రణకు సంబంధించి ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రతిపాదించారు. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధించాలని, దీని ద్వారా వారిని డిజిటల్ ప్రమాదాల నుండి రక్షించవచ్చని ఆయన పార్లమెంటు వేదికగా డిమాండ్ చేశారు.

ఈ ప్రతిపాదిత బిల్లు ప్రకారం, పిల్లల వయస్సును ధృవీకరించే పూర్తి బాధ్యతను మెటా , యూట్యూబ్ , ఎక్స్ వంటి సామాజిక మాధ్యమ సంస్థలపైనే ఉంచాలని ఆయన సూచించారు. సోషల్ మీడియా వ్యసనంగా మారడమే కాకుండా, భారతీయ వినియోగదారుల డేటాను ఏఐ వ్యవస్థల అభివృద్ధి కోసం సంస్థలు వాడుకుంటున్నాయని, ఇది దేశ భద్రతకు మరియు వ్యక్తిగత గోప్యతకు భంగకరమని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్రణ లేని ప్లాట్‌ఫారమ్‌లు పిల్లలను ఆన్‌లైన్ వేధింపుల, ఇతర ప్రమాదకర అంశాలకు గురిచేస్తున్నాయని ఆయన వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఇదే అంశంపై జరుగుతున్న చర్చను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధించగా, ఫ్రాన్స్ 15 ఏళ్ల వయస్సును పరిమితిగా నిర్ణయించింది. బ్రిటన్, గ్రీస్, డెన్మార్క్ వంటి దేశాలు కూడా ఇదే దిశగా తమ విధానాలను సమీక్షిస్తున్నాయి. భారతదేశంలో కూడా ఇదే తరహా జాతీయ విధానం అవసరమని, రాష్ట్రాల వారీగా కాకుండా దేశమంతటా ఒకే విధమైన చట్టం ఉండాలని ఆయన ప్రతిపాదించారు.