ఏపీ విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తీరుపై బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ఆగ్రహం..!

తేజస్వీ సూర్యపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫైరింగ్!

ఏపీ విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తీరుపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది. ఆయన పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. రేవంత్ రెడ్డి హైబ్రీడ్ మోడల్ ను ఏకి పారేసిన వైనాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ.. విభజనపై మాట్లాడిన మాటలను ఖండించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వరుసగా రంగంలోకి దిగారు.

మొదట మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టారు. తేజస్వీ సూర్యపై విరుచుకుపడ్డారు. ఆయనను వెధవ అని కూడా సంబోధించారు. ఆయన అలా మాట్లాడుతూంటే బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తేజస్వీసూర్య పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలన్నారు. తర్వాత హరీష్ రావు కూడా ప్రెస్మీట్ పెట్టి తేజస్వీ సూర్యపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ పోరాటం గురించి ఆయనకు తెలియదన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు చాలా మంది సోషల్ మీడియాలో స్పందించారు.

తేజస్వీ సూర్య బీజేపీకి చెందిన ఎంపీ కావడంతో ఆయన మాటల్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక బీజేపీ నేతలు తంటాలు పడుతున్నారు. అయితే కాంగ్రెస్ విభజన చేసిన తీరును మాత్రమే తేజస్వీ సూర్య ప్రస్తావించారని బీజేపీ నేతలంటున్నారు. బీజేపీని కార్నర్ చేయడానికి తేజస్వీ సూర్య అవసరమైన కంటెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడా టాపిక్ పై ప్రజలకు ఆసక్తి ఉందా లేదా అన్నదే కీలకం.

బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు..!.

లోక్సభలో డిలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లుపై చర్చలో భాగంగా కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపాయి. గతంలోని యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఏపీ, తెలంగాణాలను దేశాన్ని భారత్, పాకిస్థాన్‌గా వేరుచేసిన బ్రిటీషర్ల కంటే ఘోరంగా విభజన చేసిందని తేజస్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తన ప్రసంగంలో దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన ఫార్ములాను తేజస్వీ ప్రస్తావించారు. రేవంత్‌ ప్రతిపాదన అత్యంత తెలివి తక్కువదని చెప్పిన సూర్య అలాంటి ప్రతిపాదనతో ముందుకెళితే ఒక వ్యక్తి, ఒక ఓటు అన్న రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రానికి విలువే ఉండదన్నారు. ఇదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో నాటి కాంగ్రెస్ సర్కార్‌ బ్రిటీషర్ల కంటే ఘోరంగా వ్యవహరించిందని ఆరోపించారు…నియోజకవర్గాల పునర్విభజనకు రాష్ట్ర జనాభాను, జీఎస్‌డీపీని అనుసంధానించాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదన అత్యంత తెలివితక్కువది. ఇది రాజ్యాంగ విరుద్ధం. మీకు గుర్తుంటే కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఏపీ, తెలంగాణాలుగా విభజించినపుడు దేశాన్ని భారత్, పాకిస్తాన్‌గా విభజించిన బ్రిటీషర్ల కంటే ఘోరంగా చేశారు” -తేజస్వీ సూర్య, బీజేపీ ఎంపీ..

క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్..:..

బీజేపీ ఎంపీతేజస్వీ సూర్య వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు తేజస్వి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తేజస్వి వ్యాఖ్యలను బీజేపీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ మొదలుకొని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వరకు ప్రతి ఒక్కరు తెలంగాణపై వ్యతిరేకతను పదేపదే చాటుకుంటున్నారని ఆక్షేపించారు. తెలంగాణ రాష్ట్రం ఎవరి దయాదాక్షిణ్యాల వల్లో, ఎవరి భిక్షవల్లో ఏర్పడింది కాదని కేటీఆర్ సామాజిక మాధ్యమాల్లో స్పష్టం చేశారు. మహోన్నత తెలంగాణ ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమేనని హరీశ్ రావు ఆక్షేపించారు. బీజేపీ అధిష్టానం వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి, తన పార్టీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు..