సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.2.58 కోట్లు పోగొట్టుకున్న మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య…
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ నుండి రూ.2.58 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు.
తాము సూచించిన విధంగా పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలో అత్యధిక లాభాలు వస్తాయని ఊర్మిళ వాట్సప్‌కు మెసేజ్ పంపిన సైబర్ నేరగాళ్లు.
స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్చేంజ్ 20 అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరిన ఊర్మిళ
ఊర్మిళకు ట్రేడింగ్‌పై అవగాహన లేకపోవడంతో, మాయ మాటలు చెప్పి కొన్ని స్క్రీన్ షాట్లు పంపి తాను చెప్పిన విధంగా పెడితే 500% లాభాలు వస్తాయని నమ్మించిన దినేష్ సింగ్ అనే వ్యక్తి
దినేష్ సింగ్ మెసేజ్స్ను బలపరుస్తూ తనకు నిజంగానే లాభాలు వచ్చాయని గ్రూప్‌లో స్క్రీన్ షాట్లు పెట్టిన వాళ్ళ ముఠాలోని సభ్యురాలు ప్రియసఖి
దీంతో వీళ్ల మాయ మాటలు నమ్మి యాపిల్ యాప్ స్టోర్ నుండి MCKIEY CM అనే అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకొని.. డిసెంబర్ 24 నుండి జనవరి 5 మధ్యలో రూ.2.58 కోట్లు బదిలీ చేసిన ఊర్మిళ
ఇందుకోసం తన వద్ద ఉన్న బంగారంతో పాటు, భర్త లక్ష్మీనారాయణ దగ్గర ఉన్న బంగారం కూడా తనఖా
యాప్‌లో లాభాలు కనిపించినా విత్ డ్రా ఆప్షన్ కనిపించకపోవడంతో మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
సైబర్ నేరగాళ్లు మ్యూల్ ఖాతాలకు డబ్బులు పంపించారని, వాటిని గుర్తించే పనిలో ఉన్నామని తెలిపిన పోలీసులు..
2025 నవంబర్ చివరి వారంలో లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ వాట్సాప్‌కు ఒక అపరిచిత నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. ‘మా టిప్స్ ప్రకారం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే ఊహించని లాభాలు వస్తాయి’ అన్నదే ఆ మెసేజ్ సారాంశం. ట్రేడింగ్‌పై పెద్దగా అవగాహన లేని ఊర్మిళ.. ఆ మాటలను నమ్మి తన భర్త లక్ష్మీనారాయణ నంబర్‌ను సైతం స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్సేంజ్ 20 అనే వాట్సాప్ గ్రూపులో చేర్పించారు. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారి దినేష్ సింగ్ అనే వ్యక్తి.. తనని తాను ఐఐటీ ముంబై గ్రాడ్యుయేట్‌గా, అమెరికాలో పీహెచ్డీ చేసిన విద్యావంతుడిగా పరిచయం చేసుకున్నాడు. త్వరలో తను రాసిన ‘స్టాక్ మార్కెట్ ట్రెజర్ హంటింగ్ సీక్రెట్స్’ అనే పుస్తకం విడుదల కాబోతోందని నమ్మబలికాడు.
అతనికి వత్తాసు పలుకుతూ ప్రియసఖి అనే మరో మహిళ.. దినేష్ చిట్కాల వల్ల తామంతా కోట్లు సంపాదిస్తున్నామని తప్పుడు స్క్రీన్ షాట్లు, నకిలీ పత్రాలను గ్రూపులో పోస్ట్ చేసేది. తాము ‘సెబీ’ గుర్తింపు పొందిన మొకిన్లీ సంస్థ ద్వారా లావాదేవీలు జరుపుతున్నామని నకిలీ పత్రాలు చూపించి బాధితులను పూర్తిగా బుట్టలో పడేశారు. వారి మాయలో పడిన బాధితురాలు ఆపిల్ యాప్ స్టోర్ నుండి వాళ్లు చెప్పిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. 2025 డిసెంబర్ 24 నుండి 2026 జనవరి 5 మధ్య 19 విడతలుగా రూ. 2.58 కోట్లను కేటుగాళ్లు సూచించిన ఖాతాలకు బదిలీ చేశారు. ఈ భారీ మొత్తం కోసం ఆమె తన వద్ద ఉన్న బంగారంతో పాటు భర్త బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం గమనార్హం..ట్రేడింగ్ యాప్‌లో లాభాలు భారీగా కనిపిస్తున్నా.. వాటిని విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. పెట్టుబడి పెట్టిన డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటో.. మరికొంత పెట్టుబడి పెట్టాలని లేకపోతే ఉన్న డబ్బు పోతుందని నిందితులు బెదిరించడంతో మోసపోయానని గ్రహించిన ఊర్మిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. నేరగాళ్లు బాధితురాలి నుండి వసూలు చేసిన సొమ్మును మ్యూల్ ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించారు. జేడీ లక్ష్మీనారాయణ వంటి చట్టంపై అవగాహన ఉన్న వ్యక్తుల కుటుంబాలే ఇలాంటి మోసాల బారిన పడటం పట్ల పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే అపరిచిత పెట్టుబడి సలహాలను నమ్మవద్దని.. సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్ల ద్వారానే పెట్టుబడులు పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959