ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకస్మిక ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాలతో పాటు జాతీయ స్థాయిలో తీవ్ర ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తిస్తోంది. బుధవారం ఉదయమే హస్తినకు బయలుదేరనున్న సీఎం, తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో కీలక భేటీలు కానున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలతో కేంద్రం పలు కీలకమైన బిల్లులను ప్రవేశపెడుతున్న తరుణంలో, ఎన్డీయే కూటమిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రధాన భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది….పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు సహా పలు పెండింగ్ అంశాలపై ఈ భేటీల్లో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో అత్యంత ముఖ్యమైన అంశం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత వేగంగా నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు స్వయంగా కలసి ఆహ్వానించనున్నారు. ఉత్తరాంధ్ర ఆర్థిక, పర్యాటక రూపురేఖలను మార్చేసే ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారనుంది..
ప్రధాని మోదీతో భేటీ తర్వాత సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. హోమంత్రి అమిత్ షాతో సమావేశమై విభజన హామీల అమలు, నిధుల విడుదలపై చర్చించే అవకాశం ఉంది. పియూష్ గోయల్‌తో సమావేశమై ఏపీకి కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులు, పెట్టుబడుల ఆకర్షణపై విజ్ఞప్తులు సమర్పిస్తారు. మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయి అమరావతి రాజధాని నగర నిర్మాణానికి సంబంధించిన నిధులు, కేంద్ర సాయంపై చర్చించనున్నారు. సీఆర్ పాటిల్‌తో సమావేశమై జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిధులు, పనుల పురోగతి, ఏపీలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా మాట్లాడనున్నారు..