సీఎం చంద్రబాబు నాయుడు.. సతీసమేతంగా దుర్గమ్మ ఆలయానికి..!

ఆరవ రోజు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూలానక్షత్రం కావడంతో సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తోన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అర్థరాత్రి నుంచే క్యూలైన్లలో బైరులు తీరారు. గంటగంటకూ భక్తుల రద్దీ పెరుగుతుండటంతో.. వేగంగా దర్శనాలు అయ్యేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. కాగా.. మూలానక్షత్రం సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటున్న క్రమంలో వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు.

దుర్గమ్మకు చీర-సారె
సీఎం చంద్రబాబు నాయుడు.. సతీసమేతంగా దుర్గమ్మ ఆలయానికి విచ్చేశారు. సీఎం దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు – భువనేశ్వరి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు, సారెను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు వారికి ఆశీర్వచనం చేసి.. అమ్మవారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు.