రాజకీయ ప్రయోజనం లేనందునే సీట్లు పెంచలేదు అవసరమైతే కేంద్రంపై పోరాడుతాం : సీఎం రేవంత్‌..

Delimitation will cause losses, says CM Revanth–
వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
రాజకీయ ప్రయోజనం లేనందునే సీట్లు పెంచలేదు
అవసరమైతే కేంద్రంపై పోరాడుతాం : సీఎం రేవంత్‌.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. రాజకీయ ప్రయోజనాలు లేకపోవడం వల్లే తెలుగు రాష్ట్రాల్లో శాసనసభా నియోజకవర్గాల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం పెంచలేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గురువారం శాసనసభలో డీలిమిటేషన్‌కు వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో సీఎం తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ‘డీలిమిటేషన్‌లో జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోకూడదు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలి. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 119 నుంచి 153కు పెంచాలి. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను అధికం చేయాలి. మహిళలకు కేటయించాలి. జనాభా నియంత్రణపై కేంద్రం ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి. ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించడంలో విఫలమయ్యాయి. ప్రస్తుతం డీలిమిటేషన్‌ జనాభా ప్రాతిపదికన జరుగుతున్నదని’ సీఎం చెప్పారు. 1971లో రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్‌ను 25ఏండ్ల వరకు నిలిపేశారు. అప్పట్లో గందరగోళం నెలకొంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ డీలిమిటేషన్‌పై సమావేశం ఏర్పాటు చేశారు. జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించబోమని అందులో తీర్మానం చేశాం. జనాభా ఆధారంగా చేసే డీలిమిటేషన్‌ను మాజీ ప్రధాని వాజ్‌పేయి కూడా వ్యతిరేకించారు. దీనిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని కొందరు అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం లోక్‌సభలో 24 శాతం ప్రాతినిథ్యం ఉంది. డీలిమిటేషన్‌ జరిగితే ఇది 19 శాతానికి పడిపోతుందని’ సీఎం చెప్పారు. దీనికి వ్యతిరేకంగా అందరూ ఒకేమాటపై ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పెట్టే తీర్మానానికి పార్టీలు, రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలి. ఏపీ, తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు పెంచాలని పునర్విభజన చట్టంలో ఉంది. ఇప్పటివరకు వాటిని పెంచలేదు. కేంద్రం వివక్ష చూపుతున్నది. జమ్మూకాశ్వీర్‌లో రాజ్యాంగాన్ని సవరించి 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను 83 నుంచి 90కి పెంచారన్నారు. సిక్కింలో 2018లో అప్పటి క్యాబినెట్‌ తీర్మానం చేస్తే, ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కొనసాగిస్తున్నారు. రాజకీయ ప్రయోజనం లేకపోవడంతోనే తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపును కేంద్రం పట్టించుకోలేదు. 24 శాతం ప్రాతినిథ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి 36 శాతం పన్నులు కడుతున్నాయి. కేంద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వాటా తక్కువ వస్తున్నది. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌కు మాత్రం కేంద్రం పన్నుల్లో ఎక్కువ వాటా ఉంది’ సీఎం రేవంత్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ విధానాలను ప్రజల ముందు ఉంచేందుకే సభలోఈ తీర్మానం ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే పోరుబాట పడతామని ప్రకటించారు. త్వరలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మాజీ కుందూరు జానారెడ్డి ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశానికి అందరూ రావాలని విజ్ఞప్తి చేశారు. సీఎం ప్రసంగం అనంతరం స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ తీర్మానాన్ని సభ ఆమోదానికి ఉంచారు. ఆయా పార్టీలన్నీ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చాయి.