ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్..!
`
* రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్..
* రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్ చేపట్టనున్నట్లు ఆర్.కృష్ణయ్య తెలిపారు.
* అలాగే కలెక్టరేట్లు, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.
బకాయిలు విడుదల చేయకుండా 18 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్ ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..
రాష్ట్రంలో విద్యా రంగానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ బకాయిల విడుదలలో జరుగుతున్న ఆలస్యానికి నిరసనగా.. ఈ నెల 30న (జూన్ 30) రాష్ట్రవ్యాప్తంగా తరగతుల బహిష్కరణ, కళాశాలల బంద్, కలెక్టరేట్ల ముట్టడి, అలాగే రాస్తారోకోలు చేపట్టాలని విద్యార్థి, నిరుద్యోగ, ప్రజా, బీసీ సంఘాలకు ఆయన పిలుపునిచ్చారు. ..హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో జరిగిన 14 బీసీ సంఘాల కీలక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫీజులు చెల్లించకుండా 18 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆడుకుంటున్నారని మండిపడిన కృష్ణయ్య.. 30వ తేదీ నుంచి తమ ఉద్యమాల తీవ్రత ఏంటో ప్రభుత్వానికి రుచి చూపిస్తామని హెచ్చరించారు. మరోవైపు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీసీ ఐకాస ఛైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వ బీసీ వ్యతిరేక చర్యలను ఎండగట్టేందుకు, నిరసనగా జులై 2న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ సైఫాబాద్లోని బీసీ భవన్లో మాట్లాడిన ఆయన.. ఒకవేళ ఈ బంద్కు కూడా ప్రభుత్వం స్పందించకపోతే, జులై 15న వేలాది మంది విద్యార్థులతో హైదరాబాద్లో ‘విద్యార్థి మార్చ్’ పేరిట భారీ మహా ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీసీ సంఘాలు ఐక్యంగా ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతుండటంతో రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమం వేడెక్కింది.