రెండు దేశాల మధ్య కాల్పుల విరమణలో డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు …
భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించడంతో సరిహద్దుల్లో ప్రశాంతవాతావరణం నెలకొంది. అయితే, తాజాగా.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉందన్న ట్రంప్.. కాశ్మీర్ అంశంపై కీలక ప్రస్తావన చేశారు…డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.. ‘‘ ప్రస్తుత సంఘర్షణతో మరణాలు, విధ్వంసం తప్ప ఏమీలేవని భారత్, పాకిస్థాన్ లోని శక్తివంతమైన నాయకత్వాలు అర్థం చేసుకున్నందుకు గర్వంగా ఉంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే లక్షలాది మంది అమాయక ప్రజలు చనిపోయే అవకాశం ఉంది. ఇరుదేశాలు కాల్పుల విరమణ నిర్ణయంలో అమెరికా భాగస్వామ్యం ఉండటం నేను గర్విస్తున్నాను. ఈ రెండు గొప్ప దేశాలతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటాం. అంతేకాదు.. వెయ్యి సంవత్సరాల తరువాత కాశ్మీర్ సమస్య విషయంలో ఒక పరిష్కారంకు రావడానికి అమెరికా ఆ రెండు దేశాలతో కలిసి పనిచేస్తుంది.’’ అని ట్రంప్ పేర్కొన్నాడు.
అంతకు ముందు…
విదేశాంగ కార్యదర్శి.: విక్రమ్ మిస్రి మాట్లాడుతూ, ‘పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల ప్రధాన అధికారి (DGMO) ఈ రోజు మధ్యాహ్నం 3:35 గంటలకు భారత DGMOకి కాల్ చేశారు. భూమిపై, గగనతలంలో మరియు సముద్రంలో అన్ని కాల్పులు మరియు సైనిక చర్యలను భారత కాలమాన ప్రకారం ఈ రోజు సాయంత్రం 5:00 గంటల నుండి ఆపాలని ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇరుపక్షాలు తగిన సూచనలు జారీ చేశాయి. మే 12న మధ్యాహ్నం 12:00 గంటలకు DGMOలు మళ్లీ మాట్లాడతారు.