అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటన షడ్యూల్ ఫిక్స్….!

Donald Trump to Visit India Next Year భారత్-అమెరికా (India-USA) ద్వైపాక్షిక సంబంధాలలో మరో చారిత్రాత్మక మైలురాయికి వేదిక సిద్ధమవుతోంది… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వచ్చే ఏడాది 2027 ఆరంభంలో భారతదేశంలో అధికారికంగా పర్యటించనున్నారు..ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. తాము అదే దిశగా పనిచేస్తున్నామని చెప్పారు. వైట్ హౌస్‌లో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన రూబియో, ఈ ఏడాది ముగిసేలోపు తాను భారత్‌కు వచ్చి అధ్యక్షుడి పర్యటన ఏర్పాట్లపై చర్చలు జరుపుతానని తెలిపారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి.

మోదీ నాయకత్వంపై ప్రశంసలు
ఈ సందర్భంగా ప్రధాని మోదీ నాయకత్వాని ప్రశంసించారు మార్కో రూబియో. భారత్‌ను అమెరికాకు అత్యంత సన్నిహిత భాగస్వామి, మిత్రదేశంగా అభివర్ణించారు. ప్రధాని మోదీ చేసిన పనులకు తామంతా పెద్ద అభిమానులమని తెలిపారు. ప్రపంచ వేదికపై భారత్ ప్రభావం గణనీయంగా పెరగడంతో ఇరు దేశాల భాగస్వామ్యం మరింత బలపడిందని ఆయన అన్నారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య వ్యక్తిగత అనుబంధం కూడా చాలా బలంగా ఉందని తెలిపారు. దౌత్య సంబంధాల్లో ఈ అంశం ఎంతో కీలకమని పేర్కొన్నారు.

‘భారత్-అమెరికా సంబంధాలు అత్యంత బలంగా ఉన్నాయి
ఇటీవల జీ7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య జరిగిన భేటీ తర్వాత ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని మార్కో రూబియో అన్నారు. భారత్-అమెరికా సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. జీ7 సదస్సులో ప్రధాని మోదీతో అధ్యక్షుడు ట్రంప్ చాలా మంచి సమావేశం నిర్వహించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ద్వైపాక్షిక సంబంధాలు అత్యంత బలమైన స్థితిలో ఉన్నాయని ఆయన అన్నారు.

వాణిజ్య ఒప్పందం తుది దశలో
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కూడా తుది దశకు చేరుకుందని రూబియో వెల్లడించారు. వాణిజ్య ఒప్పందాన్ని త్వరలోనే ఖరారు చేస్తామనే ఆశాభావంతో ఉన్నామని అన్నారు. అది పూర్తికావడానికి చివరి దశలో ఉన్నామని పేర్కొన్నారు. చర్చలు చాలా సానుకూలంగా సాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ ఒప్పందం కుదిరితే ఇరు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇకఇంధన సరఫరాను పెంచడానికి భారత్‌-అమెరికా కలిసికట్టుగా పనిచేస్తున్నాయన్నారు. చమురు శుద్ధి చేయగల సామర్థ్యం ఉన్న కొన్ని దేశాలలో భారత్‌ కూడా ఒకటని పేర్కొన్నారు..

ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ఉన్న బలమైన వ్యక్తిగత మైత్రి (Personal Bonding) ఇరు దేశాల రక్షణ, వాణిజ్య బంధాలకు ప్రధాన పునాది అని కొనియాడారు. ప్రధాని మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో భారతదేశం ప్రపంచ శక్తిగా (Global Power) ఎదిగిందని రూబియో కొనియాడారు.ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత్, అమెరికా, వెనిజులా దేశాల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయని, ముఖ్యంగా ఇంధన సరఫరాలను (Energy Supplies) పెంచడంపై దృష్టి సారించామని స్పష్టం చేశారు. భారీ స్థాయిలో ముడి చమురును శుద్ధి చేసే (Crude Oil Refining Capacity) అరుదైన సామర్థ్యం భారతదేశానికి ఉండటం ఇరు దేశాల భాగస్వామ్యానికి మరింత బలాన్ని ఇస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.