భారీ వర్షాలకు మూసీనది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. చాదర్‌ఘాట్, ముసారాంబాగ్, పురానాపూల్, ఎంజీబీఎస్ తదితర ప్రాంతాలను వరద ఒక్కసారిగా ముంచెత్తింది. హైడ్రా, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అధికార యంత్రాంగం డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటించారు.
Drone to Flood Victims in Hyderabad
మలక్‌పేటలోని మూసానగర్‌లో ఇళ్లను వరద చుట్టుముట్టింది. మూసీ ప్రవాహంలో చిక్కుకున్న వారికి అధికారులు సాయం అందిస్తూ, ముంపు ప్రాంతాల్లోని వారికి డ్రోన్ ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నారు. మలక్‌పేట పరిధిలో బాధితులకు డ్రోన్ ద్వారా ఆహారం సరఫరా చేస్తున్నారు. ఇళ్ల పైకి చేరి సాయం కోసం చూస్తున్న వారికి డ్రోన్‌తో ఆహారం అందించారు….ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పునరావాస కేంద్రాల్లో 4,500 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు మలక్‌పేట్ మూసానగర్ కమ్యూనిటీ హాల్లో 150 మందికి వసతి ఏర్పాటు చేసినట్లు వివరించారు. దుర్గానగర్, అంబేడ్కర్‌నగర్ నుంచి 45 కుటుంబాలు తరలించి మూసారాంబాగ్ జడ్పీహెచ్ఎస్లో వసతి కల్పించారు.
గోల్నాక పరిధిలోని కృష్ణానగర్‌లో 32 మందిని కమ్యూనిటీ హాల్‌కు, భూలక్ష్మీఆలయం ప్రాంతం నుంచి 55 మందిని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్‌కు అధికారులు తరలించారు. పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులకు ఆహారం పంపిణీ చేస్తున్నట్లు అధికారుల వెల్లడించారు..వంతెనపై రాకపోకలు నిలిపివేత : హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ బ్రిడ్జి వద్ద మూసీనది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. చాదర్‌ఘాట్ చిన్న వంతెనపై 6 అడుగుల మేర వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉంది. దీంతో అధికారులు చాదర్‌ఘాట్ చిన్న వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. కోఠి, నాంపల్లి మార్గాలకు ఒక వంతెన పైనుంచే రాకపోకలు సాగుతున్నాయి. దీంతో ఆ వంతెనపై రద్దీ పెరిగింది. చాదర్‌ఘాట్ వద్ద మూసీ పక్కన ఉన్న కాలనీల్లోకి వరదనీరు చేరింది. చాదర్‌ఘాట్ చిన్న వంతెన పరిసరాల్లోని ఇళ్లల్లోకి వరదనీరు చేరడంతో లోతట్టు కాలనీ వాసులను అధికారులు ఖాళీ చేయించారు.
అంబర్‌పేట-దిల్సుఖ్నగర్ మధ్యలోని మూసారాంబాగ్ వద్ద ప్రమాదకరంగా మూసీ ప్రవహిస్తుంది. వంతెన పైనుంచి వరదనీరు వెళుతుంది. మూసారాంబాగ్ పాత వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రవాహం ఉంది. నిర్మాణంలో ఉన్న కొత్త వంతెనను కూడా తాకుతూ వరద ప్రవహిస్తుంది. నిర్మాణంలో ఉన్న కొత్త వంతెన సామగ్రి వరద నీటిలో కొట్టుకుపోయింది. స్లాబ్ కోసం ఏర్పాటు చేసిన సామగ్రి అని అక్కడి వారు చెబుతున్నారు. అంబర్పేట్ నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారి మూసివేశారు.
మూసీ ఈసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నార్సింగి, హిమాయత్‌సాగర్ వద్ద సర్వీస్ రోడ్ పూర్తిగా మూసివేశారు. మంచిరేవుల-నార్సింగికి వెళ్లే సర్వీస్ రోడ్లో ప్రయాణికులకు వెళ్లకుండా రహదారిని మూసివేశారు.