పసిఫిక్‌లో ‘సూపర్ ఎల్‌ నినో’.. ప్రపంచానికి పెను ముప్పు తప్పదా?..

వాషింగ్టన్‌: పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడుతున్న ‘సూపర్ ఎల్‌ నినో’ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఎల్‌ నినో అత్యంత శక్తివంతంగా మారే అవకాశం ఉందని, నవంబర్‌–డిసెంబర్‌ నాటికి గరిష్ట తీవ్రతకు చేరుకోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్‌ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే ‘సూపర్ ఎల్‌ నినో’ స్థాయికి చేరుకున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అయితే సముద్రం లోతుల్లో భారీగా పేరుకుపోయిన వేడి నీరు రాబోయే నెలల్లో పైకి వస్తే పరిస్థితి మరింత తీవ్రతరం కావచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, పసిఫిక్‌ మహాసముద్రం లోతుల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 1982-83, 1997-98, 2015-16 సంవత్సరాల్లో నమోదైన తీవ్రమైన ఎల్‌ నినో పరిస్థితుల స్థాయిలను ఇప్పటికే అధిగమించినట్లు తాజా అంచనాలు సూచిస్తున్నాయి.
వేగంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఎల్‌ నినో తీవ్రత పెరగడం, సముద్రం లోతుల్లో భారీగా పేరుకుపోయిన ఉష్ణరాశి వంటి అనేక సూచికలు ఈసారి పరిస్థితి అసాధారణంగా ఉండొచ్చనే సంకేతాలను ఇస్తున్నాయని వాతావరణ నిపుణుడు కొలిన్‌ మెక్‌కార్తీ పేర్కొన్నారు.
ఎల్‌ నినో మరింత బలపడితే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో విపరీతమైన వేడి, వర్షపాతంలో మార్పులు, కరువు లేదా భారీ వర్షాలు వంటి వాతావరణ ప్రభావాలు కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.