మాజీ ఎంపీ జగన్నాథం కన్నుమూత..
TG: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మరణించారు…
మాజీ ఎంపీ డాక్టర్ మంద జగన్నాథం కన్నుమూశారు. ఆయన వయస్సు 73 ఏళ్లు . గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతోన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1996లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తెలుగు దేశం పార్టీలో మందా జగన్నాథం చేరారు.
అనంతరం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. ఇదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వరుసగా జరిగిన ఎన్నికల్లో నాలుగు సార్లు.. 1996, 1999, 2004, 2009 ఆయన ఎంపీగా విజయం సాధించారు. అయితే 2009లో ఆయన టీడీపీ వీడి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి ఆయన ఎంపీగా అదే స్థానం నుంచి గెలుపొందారు.
ఇక 2014లో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు.. అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో.. ఆయన కాంగ్రెస్ పార్టీ వీడి.. నాటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరారు. అదే సమయంలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరగడంతో.. బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ స్థానం నుంచి బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు..గతేడాది డిసెంబర్ చివరి వారంలో మంద జగన్నాథం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతోన్నారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు నిమ్స్కు తరలించారు. ఆయన్ని నిమ్స్లోని ఆర్ఐసీయూ విభాగంలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నాటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన.. ఆదివారం సాయంత్రం కన్నుమూశారు..