జీ రామ్ జీ బిల్లుకు లోక్‌సభలో ఆమోదముద్ర…!

వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్ (వీ బీ జీ రామ్ జీ) బిల్లుకు లోక్‌సభలో ఆమోదముద్ర పడింది. భారత్‌లో 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) తీసుకొచ్చిన విషయం తెలిసిందే…దాన్ని రద్దు చేసి వీ బీ జీ రామ్ జీని ఎన్డీఏ సర్కారు అమలు చేయనుంది. ఎంజీఎన్ఆర్‌ఈజీఏను గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కోసం తీసుకొచ్చారు. ఇదే లక్ష్యంతో వీ బీ జీ రామ్ జీని తీసుకొస్తున్నారు…

కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ప్రత్యామ్నాయంగా కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. ‘వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌-గ్రామీణ్‌’ (VB-జీ రామ్‌ జీ) అనే పేరుతో రూపొందించిన ఈ బిల్లుకు గురువారం లోక్‌సభలో ఆమోదం లభించింది. బిల్లుపై చర్చ సమయంలో సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విపక్షాల ఎంపీలు బిల్లుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం దగ్గరకు చేరారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు బిల్లును చీర్చి సభలో విసిరేయడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో కూడా స్పీకర్ ఓటింగ్ నిర్వహించి, మూజువాణి ఓటుతో బిల్లును గెలిచినట్లు ప్రకటించారు.

ఈ కొత్త పథకానికి సంబంధించిన బిల్లును ఇవాళ లోక్‌సభలో ఆమోదించే వేళ విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. నిరసనల మధ్యే ఈ బిల్లుకు ఆమోదముద్ర పడింది. లోక్‌సభలో తరుచూ గందరగోళం నెలకొంటుండడంతో సభ రేపటికి వాయిదా పడింది..
బిల్లును లోక్‌సభలో నిన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రవేశపెట్టారు. ఈ చట్టం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధిని కల్పిస్తుందని, గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలన్న మహాత్మా గాంధీ కలను సాకారం చేస్తుందని అన్నారు.

వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) బిల్లు గ్రామాల సమగ్ర అభివృద్ధిని సాధిస్తుందని, పేదరిక రహిత గ్రామాలుగా మార్చుతుందని, వేగంగా అభివృద్ధి సాధించేలా చేస్తుందని చెప్పారు.

అయితే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పేరు మార్చడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి పథకానికి పేరు మార్చి, లిఖిత పూర్వకంగానే కాకుండా ఆచరణలోనూ రామ రాజ్య భావనను నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా గాంధీతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్‌ గౌరవాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని మొయిత్రా విమర్శించారు. ఈ బిల్లు “నా కిసీ కా సాథ్, నా కిసీ కా వికాస్, నా రహీమ్ కా, నా రామ్ కా” అనే భావనను ప్రతిబింబిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. 2005 నాటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ భారతంలో జీవన భద్రత భావనకు విప్లవాత్మక మార్పు తెచ్చిందని చెప్పారు..