మూడేళ్ల క్రితం పల్నాడు జిల్లా వినుకొండలో ప్రారంభమైన బంగారు వ్యాపారంలో చోరీ జరిగింది.
ఆరు నెలల క్రితం ‘వేక్షిత జ్యూయలర్స్’ పేరుతో ఆధునిక షోరూమ్ ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం రాత్రి షాపు మూసివేసి యజమానులు వెళ్లగా, మరుసటి రోజు ఉదయం షట్టర్ యథావిధిగా ఉన్నా లోపల చోరీ జరిగినట్లు గుర్తించారు. మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకున్న దొంగలు, గోడకు కన్నం వేసి షాపులోకి ప్రవేశించి, లాకర్లోని భారీ బంగారు ఆభరణాలను వదిలేసి, వెండి వస్తువులతో పాటు చిన్న బంగారు ఆభరణాలను అపహరించారు. దొంగలు సీసీ కెమెరాల హార్డ్డిస్క్ను తీసుకెళ్లడంతో పాటు, ఆనవాళ్లు దొరకకుండా కారం పొడి చల్లి వెళ్లారు. పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ లారీ ఆఫీస్ నుంచి చెక్పోస్ట్, డిగ్రీ కాలేజ్ మీదుగా నూజెండ్ ఆర్వోబీ నిర్మాణ ప్రాంతం వరకు వెళ్లి ఆగిపోవడంతో, దొంగలు వాహనాల్లో పరారై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కేసు ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.