H-1Bపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.. కాగ్నిజెంట్, క్లౌడెరాకు షాక్.!

H-1Bపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.. కాగ్నిజెంట్, క్లౌడెరాకు షాక్!

అమెరికాలో H-1B, గ్రీన్‌కార్డ్ ప్రక్రియపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. వీసా, పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్‌ (PERM) ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్, సాఫ్ట్‌వేర్ సంస్థ క్లౌడెరాకు చెందిన PERM దరఖాస్తులపై అమెరికా కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పొసిటో ప్రకారం.. కాగ్నిజెంట్ PERM దరఖాస్తులను తాత్కాలికంగా నిలిపివేశారు. వైట్‌హౌస్ ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్‌తో కలిసి వాస్తవాలు, ఆర్థిక లావాదేవీలు, అక్రమాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే కాగ్నిజెంట్‌పై ఉన్న ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.

గ్రీన్‌కార్డ్ ఆశలపై ప్రభావం

అమెరికాలో విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డ్ ప్రక్రియలో PERM కీలక దశ. సంస్థ కొత్త PERM దరఖాస్తులు దాఖలు చేయలేని పరిస్థితి ఏర్పడటంతో, కాగ్నిజెంట్ ద్వారా గ్రీన్‌కార్డ్ పొందాలని ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆమోదం పొందిన దరఖాస్తులు రద్దయ్యాయని ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు.

క్లౌడెరాపైనా చర్యలు

క్లౌడెరాపై అమెరికా కార్మిక శాఖ ఇప్పటికే 180 రోజుల పాటు PERM దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను నిలిపివేసింది. అమెరికా న్యాయ శాఖ ఆరోపణల ప్రకారం.. కొన్ని అధిక వేతన టెక్ ఉద్యోగాలకు అమెరికన్ ఉద్యోగులు దరఖాస్తు చేయకుండా అడ్డుకునేలా నియామక ప్రక్రియను రూపొందించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో H-1B, PERM ప్రోగ్రామ్‌లను దుర్వినియోగం చేసే సంస్థలపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

ముఖ్యంగా అమెరికాలో పనిచేస్తున్న భారతీయ టెక్ ఉద్యోగులపై ఈ పరిణామం ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగ్నిజెంట్ H-1B ఉద్యోగులను పెద్ద సంఖ్యలో నియమించుకునే సంస్థల్లో ఒకటి కావడంతో, దర్యాప్తు ఫలితాలు ఇప్పుడు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.