ఐరోపాలో రికార్డు స్థాయి 41 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రమాదం.. ఫ్రాన్స్‌లోనే దాదాపు వెయ్యి మంది వరకు ఎండల ప్రభావంతో మృతి..!

ఐరోపా దేశాలను ఈ ఏడాది తీవ్ర వేసవి తీవ్రంగా వేధిస్తోంది. ఎప్పుడూ చల్లటి వాతావరణానికి అలవాటుపడిన ఈ దేశాలు ఇప్పుడు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్నాయి..జర్మనీ, స్లోవేకియా, పోలండ్, ఫ్రాన్స్, రొమేనియా, సెర్బియా వంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా, ప్రభుత్వాలు అత్యవసర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అయితే మన భారతదేశంలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనా ఇలాంటి పరిస్థితి రాలేదు. కానీ ఆయా దేశాల్లో 41 డిగ్రీలకే ప్లాస్టిక్ కరిగిపోతుంది. కారణం ఏంటంటే?

ఈసారి ఐరోపా ఖండంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంతగా ఉన్నాయి. స్లోవేకియాలో 40.5 డిగ్రీల సెల్సియస్, జర్మనీలో 41.7 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బెల్‌గ్రేడ్, బుకారెస్ట్ వంటి నగరాల్లో 37 నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఈ వేడి తరంగం బాల్కన్స్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ వైపు విస్తరిస్తున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

తీవ్ర ఎండలకు వడగాలులు తోడవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. జూన్ 21 నుంచి ఇప్పటివరకు ఫ్రాన్స్‌లోనే దాదాపు వెయ్యి మంది వరకు ఎండల ప్రభావంతో మరణించినట్లు స్థానిక నివేదికలు చెబుతున్నాయి. వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిపై ఈ వేడి తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆసుపత్రుల్లో హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ కేసులు కూడా పెరుగుతున్నాయి.