కేసీఆర్‌ పాలనలో 24 గంటల కరెంట్‌.. రేవంత్‌ పాలనలో 10 గంటలు కూడా దిక్కులేదు: హరీశ్‌రావు..

కేసీఆర్‌ పాలనలో 24 గంటల కరెంట్‌.. రేవంత్‌ పాలనలో 10 గంటలు కూడా దిక్కులేదు: హరీశ్‌రావు..

దుబ్బాక: కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శించారు. దుబ్బాక మండలంలోని గంభీర్‌పూర్‌ సబ్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి లాగ్‌బుక్‌ను పరిశీలించారు.

లాగ్‌బుక్‌లో విద్యుత్‌ సరఫరా వివరాలు

సబ్‌స్టేషన్‌ లాగ్‌బుక్‌ ప్రకారం మూడో తేదీన ఉదయం 8 గంటలకు విద్యుత్‌ సరఫరా ప్రారంభమై సాయంత్రం 6 గంటలకే నిలిపివేశారని హరీశ్‌రావు తెలిపారు. నాలుగో తేదీన ఉదయం 7.45 గంటలకు సరఫరా వచ్చి సాయంత్రం 6 గంటలకు నిలిపివేశారని చెప్పారు.

‘‘రైతులకు 10 గంటలు కూడా కరెంట్‌ ఇవ్వలేని దిక్కుమాలిన పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. ఇది నా మాట కాదు.. సబ్‌స్టేషన్‌ లాగ్‌బుక్‌ చెబుతున్న వాస్తవం’’ అని హరీశ్‌రావు అన్నారు.

కేసీఆర్‌ పాలనలో రైతులకు 24 గంటల విద్యుత్‌ అందితే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కనీసం 10 గంటల విద్యుత్‌ కూడా ఇవ్వలేకపోతోందని విమర్శించారు. ఎన్నికలకు ముందు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు కేసీఆర్‌ అందించిన విద్యుత్‌లో సగం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.

18 గంటలు పనిచేస్తే.. కరెంట్‌ ఎందుకు రావడం లేదు?

రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే రైతులకు కరెంట్‌ ఎందుకు అందడం లేదో తెలంగాణ రైతాంగానికి సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి 18 గంటలు పనిచేసేది రైతుల కోసం కాదని, కమిషన్లు, వసూళ్లు, తన అన్నదమ్ములకు భూములు కట్టబెట్టడం కోసమేనని ఆరోపించారు.

రాష్ట్రంలో 40 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయని, ఆ రైతులందరినీ ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. ఒకప్పుడు మూడు గంటల కరెంట్‌ చాలని చెప్పిన ముఖ్యమంత్రి, నాలుగు గంటలు సరిపోతుందని చెప్పిన కాంగ్రెస్‌ నేతల మాటలనే ఇప్పుడు అమలు చేస్తున్నారని విమర్శించారు.

రైతులకు ఇచ్చిన హామీలన్నీ విఫలం

రుణమాఫీ నుంచి రైతుబీమా వరకు, విద్యుత్‌ నుంచి యూరియా వరకు అన్ని అంశాల్లోనూ రేవంత్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని హరీశ్‌రావు ఆరోపించారు. ఎన్నికల ముందు కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇస్తామని చెప్పి, ఇప్పటివరకు ఒక్క కౌలు రైతుకూ రూపాయి సాయం చేయలేదని అన్నారు.

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులైనా ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదని విమర్శించారు. 40 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం, 42 లక్షల మంది ఆసరా పెన్షన్‌దారులు, 5 లక్షల మంది ఉద్యోగులు పీఆర్సీ కోసం, కోటి మంది మహిళలు నెలకు రూ.2,500 సాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.

రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి

ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ నేతలు కోరడం హాస్యాస్పదమని అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ రాజీనామా చేసి పోరాడారని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని పేర్కొన్నారు.

ఆనాడు సబ్‌స్టేషన్లకు వెళ్లి లాగ్‌బుక్‌లు లాక్కున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పుడు ఏ సబ్‌స్టేషన్‌కు వస్తారో చెప్పాలని సవాల్‌ విసిరారు. నల్గొండకు రావాలని ఆహ్వానిస్తూ, తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

విద్యుత్‌ కోతలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం

ఇప్పటికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించి రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో విద్యుత్‌ కోతలపై రైతుల పక్షాన బీఆర్ఎస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

ఇప్పటికే మాచాపూర్‌, గుండారం గ్రామాల్లో రైతులు సబ్‌స్టేషన్ల ఎదుట ఆందోళనలకు దిగుతున్నారని, ఈ నిరసనల సెగ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తప్పక తగులుతుందని హరీశ్‌రావు అన్నారు.