కేటీఆర్‌కు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపే.. హరీష్ రావు..

ఫార్ములా ఈ కార్ల రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపే తప్ప మరొకటి కాదు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు..తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారు అనడానికి కేటీఆర్‌కు ఇచ్చిన తాజా నోటీసులే నిదర్శనం. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని నిరంతరం ప్రశ్నిస్తున్న కేటీఆర్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి ఈ నోటీసులు పంపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 18 నెలల పాలనలో డైవర్షన్ పాలిటిక్స్‌ను అమలు చేస్తూ బీఆర్ఎస్‌ను బద్నామ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రాజకీయ అరాచకత్వం గెలిచే ప్రసక్తే లేదు. రేవంత్ రెడ్డి డ్రామా, డైవ‌ర్షన్ రాజకీయాలు ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యాయి అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

ఫార్ములా ఈ రేసింగ్ తో తెలంగాణ ప్రతిష్ట పెరిగింది. పెట్టుబడులు కూడా వచ్చాయి. తెలంగాణ ప్రతిష్ట పెంచినందుకా కేటీఆర్‌పై మీ నోటిసుల ప్రతాపం..? 2000లో చంద్రబాబు ఫార్ములా వన్ కోసం కృషిచేసి నిర్వహించలేకపోయాడు. అలాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ కృషి వల్ల ఫార్ములా వన్ వంటి ప్రతిష్టాత్మక రేస్‌ను భారతదేశానికి అందులోనూ హైదరాబాద్ కి తీసుకొని వచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తెలంగాణను మార్చేందుకు ఫార్ములా ఈ రేస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించారు. అమర్ రాజా వంటి కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించి రాష్ట్ర పరువును, దేశ పరువును మంటకలిపింది. అందాల పోటీతో లాభం లేదు కానీ రాష్ట్ర పరువు మాత్రం తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నందుకు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చిందని స్పష్టమైతున్నది. రేవంత్ రెడ్డి.. నువ్వు ఎన్ని రకాలుగా వేధించినా నీ వైఫల్యాలను ఎండగట్టడం మాత్రం బీఆర్ఎస్ ఆపదు అని హ‌రీశ్‌రావు తేల్చిచెప్పారు..