హుజూర్ నగర్ ముత్యాలమ్మ పండుగలో తొలి ఘట్టం మొదలైంది..

మన పోంచర్లలో ( హుజూర్ నగర్) శ్రావణ మాసంలో అత్యంత వైభవంగా జరుపుకునే ముత్యాలమ్మ పండుగలో తొలి ఘట్టం మొదలైంది. ముత్యాలమ్మ తల్లులకు చల్లకూడు ఎత్తే కార్యక్రమం ఇవాళ గురువారం ఉదయం ప్రారంభమైంది. డప్పుచప్పుళ్లతో పసుపు, కుంకుమలు, వేప ఆకులతో అలంకరించిన కుండలతో కుమ్మర్లు, చాకలి వారు… మన ఊర్లోని ప్రతీ గడపకు వచ్చి…. నిండుకుండ నుంచి తీసిన అన్నం, పెరుగు తీసుకెళ్తారు. దీనినూ చల్లకూడుగా పిలుస్తూ ముత్యాలమ్మలకు నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గురు, శుక్ర, శనివారం వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రతీ ఇంటికి వచ్చి అమ్మవార్లకు మన ఇంటి నుంచి చల్లన్నం తీసుకెళ్తారు. ఇక ఆదివారం పెద్ద ముత్యాలమ్మ తల్లికి, సోమవారం మూడు ముత్యాలమ్మ తల్లులకు భక్తులు బోనాలు సమర్పిస్తారు. ప్రతీ ఏటా మన ఊరిని చల్లగా కాపాడే ముత్యాలమ్మ తల్లులకు శ్రావణ మాసంలో పండుగ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. నాటి ఆచార, సంప్రదాయాలను కొనసాగిస్తూ… ముత్యాలమ్మ తల్లి జాతరను అంతే ఘనంగా ఏటా చేసుకుంటున్నాం.. అని కమిటీ నిర్వాహకులు తెలిపారు..