వాట్సప్‌లో ట్యాక్స్ నోటీసులొస్తున్నాయ్.. మీకూ వస్తే ఏం చేయాలి.. ?

ఆదాయపు పన్ను శాఖ పేరుతో వాట్సాప్‌లో వచ్చే నకిలీ నోటీసుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.* హెచ్చరించారు.
ఆ మెసేజ్‌లలో ఉండే అనుమానాస్పద లింకులు లేదా ఫైల్స్ (.zip, .exe) క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యి బ్యాంక్ ఖాతాలు క్షణాల్లో ఖాళీ అవుతాయి.
ఐటీ శాఖ ఎప్పుడూ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపదు కాబట్టి, గుర్తుతెలియని నంబర్ల నుండి వచ్చే మెసేజ్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దు.
ఎవరైనా ఇటువంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ గారు సూచించారు..

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసి రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? ఈ క్రమంలోనే మీకు వాట్సప్ ద్వారా ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసు వచ్చిందా? అయితే అలర్ట్. ఇలా వాట్సప్ ద్వారా ఐటీ నోటీసు వచ్చినట్లయితే ఆందోళన చెందకుండా అది ఎక్కడి నుంచి వచ్చిందో పరిశీలించాలి. అందులో ఉండే ఎలాంటి లింకులపై క్లిక్ చేయకండీ. పొరపాటున క్లిక్ చేశారో సైబర్ నేరగాళ్ల వలకు చిక్కినట్లే. ప్రస్తుతం ఐటీఆర్ ఫైలింగ్ సీజన్ (ITR Filing Season) కావడంతో సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలు వేస్తూ ట్యాక్స్ చెల్లించే వారిని మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసిన వారు, రిటర్నులు దాఖలు చేయాల్సిన వారే లక్ష్యంగా వారి వాట్సప్‌కి లేదా ఇతర మెసేజింగ్ వేదికల ద్వారా సందేశాలు పంపిస్తున్నారు. ట్యాక్స్ రీఫండ్ల కోసం ఎదురుచూస్తున్నవారు, డెడ్‌లైన్ దాటినా రిటర్నులు ఫైల్ చేయని వారు తమకు నోటీసు వచ్చిందేమోనన్న భయంతో వాట్సప్ ద్వారా వచ్చిన లింకులను క్లిక్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే అదునుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు వాట్సప్ ద్వారా ట్యాక్స్ నోటీసులు అంటూ ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు.దాయపు పన్ను శాఖ ఎంబ్లమ్‌తో కూడిన డీపీతో, గుర్తు తెలియని వాట్సప్ నంబర్ (Whatsapp Number) నుంచి ఇలాంటి నోటీసులు పంపిస్తున్నారు (Income Tax Notice). రిటర్నుల్లో తప్పుడు సమాచారం నమోదు చేశారని, లేదా ఏదైనా ఇతర కారణం చెబుతూ భయపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. దీనిపై స్పందించేందుకు జిప్ లేదా .exe ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. అలా వచ్చిన ఫైల్ పై క్లిక్ చేస్తే మీ ఫోన్లో మాల్‌వేర్ మీకు తెలియకుండానే చేరుతుంది. మీకు వచ్చే ఎస్ఎంఎస్‌లు, ఓటీపీలు, కాంటాక్టు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తాయి. బ్యాంకింగ్ యాప్స్‌కు సంబంధించిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో పాటు ఇతర సున్నితమైన సమాచారం దొంగలిస్తారు.

మీకూ వస్తే ఏం చేయాలి?
కాబట్టి ఇలా వాట్సప్ లేదా ఇతర మార్గాల ద్వారా సందేశాలు వచ్చినప్పుడు వాటిల్లో ఉండే లింకులపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. ఇలాంటి నోటీసులకు స్పందించొద్దని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఐటీ విభాగం నుంచి నోటీసులు ఎప్పుడైనా రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి వస్తుంది. ఐటీఆర్ పోర్టల్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. కానీ, ఇలా వాట్సప్ ద్వారా ఐటీ శాఖ ఎప్పుడూ నోటీసులు పంపించదు. అందులోనూ లింకులపై క్లిక్ చేయాలని చెప్పదు. అలా అడిగారు అంటే అది సైబర్ నేరగాళ్ల పనే అని అర్థం చేసుకోవాలి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా ఇ-ఫైలింగ్ పోర్టల్ లోకి వెళ్లి మీ రీఫండ్ స్టేటస్ చెక్ చేస్తే అన్ని వివరాలు తెలిసిపోతాయి.