భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత..!

భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జమ్మూకశ్మీర్ సరిహద్దులోని లీపా వ్యాలీ వద్ద పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడుతోంది..దీంతో భారత సైన్యం కూడా పాకిస్తాన్కు దీటుగా బదులిస్తోంది. ఈ పరిణామం నేపథ్యంలో స్థానికులు భయాందోళన చెందుతున్నారు..తాజాగా అక్టోబర్ 26-27 మధ్య అర్ధరాత్రి కాల్పుల మోతతో దద్దరిల్లింది. నియంత్రణ రేఖ వెంబడి జమ్మూ కాశ్మీర్‌లోని వ్యూహాత్మక ప్రాంతమైన లీపా లోయలో పాకిస్తాన్ సైన్యం ఈ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. సరిహద్దుల్లోని భారత స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాక్ సైనికులు చిన్న ఆయుధాలతో కాల్పులు జరపడంతో పాటు మోర్టార్ షెల్లింగ్‌కు కూడా తెగబడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

చాలా కాలంగా లీపా లోయ వద్ద పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబాట్లకు కీలకమైన స్థావరంగా ఉంది. పాకిస్తాన్ సైన్యం ప్రారంభించిన దుశ్చర్యకు భారత సైనికులు గట్టిగా బదులిచ్చారు. పాక్ రేంజర్ల రెచ్చగొట్టే కాల్పులను భారత సైనికులు బలంగా తిప్పికొట్టారు. భారత జవాన్ల దీటైన ప్రతిఘటనతో పాకిస్తాన్ సైనికులు తోక ముడిచి వెనక్కి తగ్గక తప్పలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఆపరేషన్ సిందూర్‌ తర్వాత తొలిసారి

నియంత్రణ రేఖ వెంట మే 10వ తేదీ నుంచి శాంతి యుత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు మరణించిన తర్వాత.. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మే 7వ తేదీన చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్ భూభాగంలో లోపల ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలను భారత వైమానిక దళం ధ్వంసం చేసింది.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఆపరేషన్‌ సిందూర్‌లో వందకు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థల స్థావరాలు పూర్తిగా నాశనం అయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌ దెబ్బకు తట్టుకోలేకపోయిన పాకిస్తాన్.. భారత్‌పై డ్రోన్, క్షిపణి దాడులకు దిగింది. అయినప్పటికీ.. భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఫలితంగా.. మే 8వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పాకిస్తాన్‌లోని 11 సైనిక విమాన స్థావరాలపై దాడులు చేయడంతో.. తీవ్రంగా వణికిపోయిన ఇస్లామాబాద్ చివరకు కాల్పుల విరమణ కోసం భారత్‌కు విజ్ఞప్తి చేసింది..

మరోసారి వక్రబుద్ధి చూపించిన పాక్

ఆపరేషన్ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్ స్వయంగా శాంతి కోసం భారత్‌ను అభ్యర్థించిన తర్వాత కూడా.. తాజాగా లీపా వ్యాలీలో కాల్పుల విరమణను ఉల్లంఘించడం ఆ దేశం వక్రబుద్ధికి, సరిహద్దుల్లో శాంతిని చెదరగొట్టాలనే కుట్రకు నిదర్శనంగా నిలుస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో పూంఛ్ ప్రాంతంలో కూడా ఇలాంటి ఉల్లంఘనలు జరిగాయని వార్తలు వచ్చినా.. అప్పట్లో భారత సైన్యం వాటిని ఖండించింది. అయితే తాజా లీపా వ్యాలీ ఘటనతో సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత పెరిగింది…