ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. చారిత్రాత్మక అడుగు వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కూటమిగా ఉన్నటువంటి ఐరోపా సమాఖ్యతో (యూరోపియన్ యూనియన్) భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది…రెండింటి మధ్య ట్రేడ్ డీల్ కుదిరినట్లు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా.. భారత మార్కెట్లోకి అంతర్జాతీయ బ్రాండ్లు వెల్లువెత్తనున్నాయని చెప్పొచ్చు. ఒకప్పుడు విదేశీ లగ్జరీ ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు ఉండటంతో ఇవి చాలా ప్రియంగా ఉండేవి. ఇప్పుడు దిగుమతి సుంకాలు భారీగా తగ్గనున్న నేపథ్యంలో వాటి ధరలు భారీగా తగ్గనున్నాయన్నమాట.
ఇక్కడ ప్రధానంగా లగ్జరీ కార్లు, స్పిరిట్, వైన్‌తో పాటు ఇతర మెడికల్ ఉత్పత్తులపైనా సుంకాల భారం గణనీయంగా తగ్గుతుంది. ఈ డీల్ పూర్తి వివరాలు బయటికి రానప్పటికీ.. డీల్ ఖరారైన తర్వాత ఐరోపా సమాఖ్య చేసిన ప్రకటనతో కొన్ని ఉత్పత్తులపైన సుంకాల వివరాలు బయటికి వచ్చాయి.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వచ్చే సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ఇక వెంటనే అప్పుడు 90 శాతానికిపైగా భారత ఉత్పత్తులపై దిగుమతి సుంకాల్ని తగ్గించనున్నట్లు పేర్కొంది ఐరోపా సమాఖ్య. మిగతా ప్రొడక్ట్స్‌పై దశల వారీగా సుంకాల్ని తగ్గించనున్నట్లు వెల్లడించింది. ఇక ఒప్పందం అమల్లోకి వచ్చిన తొలి రోజు.. 30 శాతం వరకు ఐరోపా ఉత్పత్తులపై భారత్.. సుంకాల్ని ఎత్తివేయనుందని పేర్కొంది.
>> ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వైన్.. ఐరోపాలోనే తయారవుతుందన్న సంగతి తెలిసిందే. వీటిపై భారత్ 150 శాతం దిగుమతి సుంకాల్ని విధిస్తుంది. దీంతో ఇది భారత్‌కు వచ్చే సరికి ఖరీదైనదిగా మారుతుంది. ఈ సుంకాలు ఏడేళ్లలో ఏకంగా 20 శాతానికి దిగిరానుంది. రూ. 1000 విలువైన బాటిల్‌పై గతంలో దిగుమతి సుంకం రూ. 1500 గా ఉండగా.. ఇప్పుడు ఒప్పందంలో భాగంగా అది రూ. 200 గానే ఉంటుంది. మీడియం రేంజ్ వైన్‌పై సుంకం 30 శాతం వరకు తగ్గుతుంది.
ఇక లగ్జరీ కార్లపై (ఆటోమొబైల్ ఉత్పత్తులు) చూస్తే గతంలో భారత్ 66 శాతం నుంచి 125 శాతం వరకు దిగుమతి సుంకం విధించేది. ఈ సుంకాలు దశలవారీగా తగ్గనున్నాయి. తొలుత ఈ సుంకాల్ని 40 శాతానికి.. తర్వాత క్రమంగా 10 శాతానికి తగ్గించనున్నట్లు తెలుస్తోంది.
ఒప్పందం అమల్లోకి వచ్చిన ఐదేళ్లకు ఎలక్ట్రిక్ వాహనాలపై భారత్ సుంకాల తగ్గింపు మొదలవుతుంది. ముందు ఇది 30-35 శాతానికి తగ్గి.. తర్వాత మరింత తగ్గే అవకాశం ఉంది.
ఇంకా వైద్య పరికరాలపై కూడా చాలా వరకు సుంకాల్ని ఎత్తివేసే అవకాశం ఉంది. వీటిల్లో ఆప్టికల్స్, మెడికల్, సర్జికల్ పరికరాలపై సుంకాల్ని జీరోకు చేర్చే అవకాశం ఉంది.
యంత్రాలు 44 శాతం, కెమికల్స్‌పై 22 శాతంగా ఉన్న దిగుమతి సుంకాలు కూడా గణనీయంగా తగ్గనున్నాయి. వీటితో పాటు ఆలివ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్‌పైనా సుంకాల్ని ఎత్తివేయనున్నారు. సోయా మీల్, పప్పులు, డైరీ ఉత్పత్తులపై భారత్.. ఈయూకు సుంకాల మినహాయింపు ప్రకటించలేదు. ఇదే సమయంలో ఈయూ కూడా.. పౌల్ట్రీ, బీఫ్, మాంసం,చక్కెర వంటి వాటిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గనున్నాయి..!.
కార్లపై సుంకాలు
”భారత్ సహ ఇతర వాణిజ్య భాగస్వాములెవరూ పొందని సుంకాల తగ్గింపులను ఈయూ మంజూరు చేస్తుంది. ఉదాహారణకు కార్లపై సుంకాలు క్రమంగా 110 శాతంగా ఉండగా, అవి పదిశాతానికి చేరుకుంటాయి. ఐదు నుంచి పది సంవత్సరాల వరకూ కారు విడి భాగాలకు పూర్తిగా సుంకాలు ఉండవు. యంత్రాలపై 44 శాతం, రసాయనాలపై 22 శాతం, ఔషధాలపై 11 శాతం వరకూ ఉన్న సుంకాలు రద్దు చేస్తారు” అని ఈయూ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ ఎప్టీఏ ప్రకారం.. ఈయూ తరుచుగా భారతీయ వ్యవసాయ ఎగుమతులపై విధించే సుంకాలు తొలగించాల్సి ఉంటుంది. ఇవి సగటున 36 శాతంగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ రైతులకు తన మార్కెట్ ను స్వేచ్ఛగా తెరుస్తుంది. ఉదాహారణకు వైన్ లపై భారత్ విధించిన సుంకాలు అమల్లోకి వచ్చిన తరువాత ఇవి 150 శాతం నుంచి 75 శాతానికి తగ్గుతాయి. చివరకు ఇవి 20 శాతం ఉంటుంది. ఆలివ్ నూనెపై సుంకాలు ఐదు సంవత్సరాలలో 45 శాతం నుంచి సున్న శాతానికి తగ్గుతాయి. బ్రెడ్, స్వీట్లు వంటి ప్రాసెస్ చేయబడిన వ్యవసాయ ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు తొలగిస్తారు.బీఫ్, కోడి మాంసం, బియ్యం, చక్కెర వంటి ఉత్పత్తులపై నిబంధనలు సడలించారు. అలాగే యూరోపియన్ యూనియన్ కు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు కూడా రక్షించబడతాయని తెలిపారు. అన్ని భారతీయ దిగుమతులు ఈయూ విధించే నియమాలను కూడా గౌరవించాల్సి ఉంటుంది.ప్రధాని ఏం చెప్పారు..ఒప్పందం కుదిరిన విషయాన్ని స్వయంగా భారత ప్రధాని మోదీ ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన చివరి రౌండ్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ- ఈయూ అధ్యక్షురాలు వాన్ డర్ లేయన్, కలిసి యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాకు ఆతిథ్యం ఇచ్చారు.ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్ గా రెండు పక్షాలు అభివర్ణిస్తున్నారు. భారత్ లోని 140 కోట్ల మందికి , కోట్లాది మంది యూరోపియన్లకు ప్రయోజనం చేకూరుస్తుందని ఇండియన్ ఎనర్జీ వీక్ ను వర్చువల్ గా ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు.”నేను మీకు ఒక పెద్ద అభివృద్ధి గురించి తెలియజేస్తున్నాను. కల్ హీ భారత్ ఔర్ యూరోపియన్ యూనియన్ కే బీచ్ ఏక్ బహుత్ బడా ఒప్పందం హువా ఫై(నిన్న భారత్, యూరోపియన్ యూనియల్ మధ్య చాలా పెద్ద ఒప్పందం కుదిరింది) అని పేర్కొన్నారు.ఇది ప్రపంచంలో రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య సమన్వయానికి ఒక అద్బుతమైన ఉదాహారణ. ఈ ఒప్పందం ప్రపంచ జీడీపీలో 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో మూడింట ఒక వంతు ప్రాతినిధ్యం వహిస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈయూ- భారత్ మధ్య 2007 నుంచి ఎప్టీఏ కోసం చర్చలు జరుగుతున్నాయి. 2013 లో ఇవి అర్థాంతరంగా నిలిపివేశారు. ఈ చర్చలు 2022 జూన్ లో తిరిగి ప్రారంభించారు.ఈయూ భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈయూతో భారత్ మొత్తం వస్తువుల వ్యాపారం దాదాపు 136 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. ఇందులో 76 బిలియన్ల ఎగుమతులు కాగా 60 బిలియన్ల విలువ గల దిగుమతులు..
తగ్గనున్న వస్తువుల ధరలు
-కార్లు, బీర్, విస్కీ, వోడ్కా, ఆలివ్ ఆయిల్, కివీస్, వైన్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రూట్ జ్యూస్, కూరగాయల నూనె ధరలు తగ్గనున్నాయి
-ఈయూ దేశాల నుంచి భారత్‌కు ఈ వస్తువులు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. అక్కడ నుంచి దిగుమతి చేసుకునే 96.6 శాతం వస్తువులపై ఎలాంటి సుంకాలు ఉండవు. దీని వల్ల వాటి ధరలు తగ్గనున్నాయి.
భారతదేశం నుంచి ఈయూకి ఎగుమతి అయ్యే వస్తువులపై కూడా 96.6శాతం సుంకాలను తొలగిస్తామని యూరోపియన్ యూనియన్ తెలిపింది. దీంతో భారత్ నుంచి ఈయూకి ఎగుమతి అయ్యే వస్తువులకు కూడా లాభం జరగనుంది
-స్పిరిట్లపై 40 శాతం సుంకాలను తగ్గించున్నారు
– గ్రీన్ హౌస్, వాయు ఉద్గారాలను తగ్గించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు సాయం అందించేందుకు రానున్న రెండేళ్లల్లో 500 మిలియన్ యూరోల సాయం అందించనుంది.
-యూరోపియన్ అఫ్టికల్, సర్జికల్, మెడికల్ పరికరాలపై 90 శాతం సుంకాలు తొలగిస్తారు
-భారతదేశం నుంచి వెళ్లే దాదాపు అన్ని ఈయూ విమానాలు, అంతరిక్ష నౌక ఎగుమతులపై సుంకాలు తొలగించనున్నారు
-యంత్రాలపై 44 శాతం, రసాయనాలపై 22 శాతం, ఔషధాలరపై 11 శాతం వరకు సుంకాలు రద్దు అవుతాయి
-2032 నాటికి భారతదేశానికి ఈయూ ఎగుమతులు రెట్టింపు చేయడంలో ఈ ఒప్పంద ఉపయోగపడనుంది
వాణిజ్య ఒప్పందం విలువ
ఈయూ, భారత్ మధ్య జరిగిన ఈ వాణిజ్య ఒప్పందం విలువ దాదాపు 136 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఆటోమొబైల్స్, వైన్లు, స్పిరిట్స్ వంటి వాటిపై ఈయూ సుంకం రాయితీలు ఇవ్వడానికి బదులుగా భారత్ వస్త్రాలు, తోలు, ఇతర సముద్ర ఉత్పత్తులపై సుంకాలు తగ్గించింది.