డప్పుల దరువులు, శివసత్తుల పూనకాలు, లక్షలాది భక్తుల నీరాజనాల నడుమ సారలమ్మ గద్దెపైకి తీసుకువచ్చారు పూజారులు. అటు కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును మేడారంలోని గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠించడంతో జాతర అంకురార్పణ జరిగింది. ఇక రేపు సాయంత్రం జాతరలో మరో అద్భుత ఘట్టం..! చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోవడంతో.. జాతర తారాస్థాయికి చేరుకుంటుంది..
బుధవారం రాత్రి 7.38 గంటలకు బయలు దేరింది. జంపన్నవాగు వద్దకు 8.48 గంటలకు చేరుకున్నది. అక్కడి నుంచి అశేష భక్తజనం నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠించారు. అమ్మను పూజారులు మేడారంలోని గద్దెకు తరలించే ఘట్టం భక్తులను దివ్యానుభూతికి లోను చేసింది. ఈ ప్రక్రియ బుధవారం ఉదయం నుంచే మొదలైంది. కన్నెపల్లిలోని సారలమ్మ గుడిని పూజారుల కుటుంబ సభ్యులు తొలుత శుద్ధి చేశారు. గుడి లోపల, బయట అలికి ముగ్గులు వేసి మామిడి తోరణాలు, బంతి పూలతో అందంగా అలంకరించారు. సాయంత్రం అసలైన పూజాతంతు మొదలైంది. పూజా మందిరంలో ప్రధాన పూజారి కాక సారయ్యతో పాటు ఇతర వడ్డెలు రహస్య పూజలు చేశారు. లోపల పూజలు జరుగుతున్నంతసేపూ గుడి బయట ఆదివాసీ కళాకారులు డోలు వాయిద్యాలతో సంప్రదాయ నృత్యాలు చేశారు. సారలమ్మను కీర్తిస్తూ పాటలు పాడారు. శివసత్తులు శిగమూగారు. మరోవైపు.. సారలమ్మ రాకను కళ్లారా చూడాలన్న తపనతో వేలాదిగా భక్తులు ఉదయం నుంచే పెద్దసంఖ్యలో కన్నెపల్లికి చేరుకున్నారు. సాయంత్రం 7 గంటల వరకూ గుడి లోపల పూజలు జరిగాయి. పూజారి కాక సారయ్య.. సారలమ్మ ప్రతి రూపమైన కుంకుమ భరిణను తీసుకొని బయలుదేరుతున్న సంకేతం అందగానే అప్పటి వరకు గుడి బయట వేచివున్న వేలాది భక్తజనం శిగమూగారు. సంతానం లేనివారు పిల్లల కోసం వరాలు పట్టారు. గుడిలో హారతి ఇచ్చి గంటానాథం, బూరకొమ్ము ధ్వనితో మహిళలు గుడి ముందర తడిబట్టలతో సాగిలపడ్డారు..