హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై దాడులు..13 మంది భారత జాతీయులు మరణించగా, మరో ముగ్గురు గల్లంతు…!
ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీని కడతేర్చినా తరువాత, అమెరికా-ఇజ్రాయెల్ (War) సంయుక్త వైమానిక దాడుల అనంతరం ఫిబ్రవరి 28న ఈ ప్రాంతంలో ఘర్షణలు చెలరేగినప్పటి నుండి గల్ఫ్ ప్రాంతంలో మొత్తం 13 మంది భారత జాతీయులు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు..హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమాచారం వెలువడింది. ఈ దాడులు వాణిజ్య నౌకాయానానికి, సముద్ర భద్రతకు ముప్పుగా పరిణమించాయని ప్రభుత్వ వర్గాలు ఏఎన్ఐకి తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్‌తో కలిసి ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ కింద ఇరాన్‌పై సైనిక చర్య ప్రారంభించినప్పటి నుండి ఈ ప్రాణనష్టం నమోదైంది. ఇది టెహ్రాన్ ప్రతీకార దాడులకు దారితీయడంతో పాటు, ఈ ప్రాంతమంతటా ఉద్రిక్తతలను పెంచింది. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే ఇంధన మార్గాలలో ఒకటైన హోర్ముజ్ జలసంధి గుండా నౌకాయానానికి ఈ ఘర్షణ తీవ్ర అంతరాయం కలిగించింది. ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని ఇరాన్ దిగ్బంధించడం, వాణిజ్య నౌకలపై దాడులు చేయడం వాణిజ్యం, ఇంధన సరఫరా, నావికుల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను పెంచాయి..
మంగళవారం జరిగిన వారపు మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, భారత్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన, నిరంతరాయమైన నౌకాయానానికి తమ పిలుపును పునరుద్ఘాటించారు. ఇటీవల రెండు వాణిజ్య నౌకలపై దాడి జరిగిందని, వాటిలో మొత్తం 30 మంది భారతీయ నావికులు ప్రయాణిస్తున్నారని జైస్వాల్ తెలిపారు. ఒక నౌకలో 12 మంది భారతీయులు ఉండగా, వారిలో ఒక నావికుడు మరణించాడు. రెండవ నౌకలో 18 మంది భారతీయ సిబ్బంది ఉండగా, వారిలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల వాణిజ్య నౌకలపై జరిగిన దాడులలో అన్ని దేశాల వారితో పోలిస్తే భారతీయ నావికులే అత్యధిక సంఖ్యలో మరణించారని ఆయన తెలిపారు. అయితే, బ్రీఫింగ్ సందర్భంగా ఆయన కచ్చితమైన మొత్తం సంఖ్యను వెల్లడించలేదు.