ఇండోనేషియా తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు.

ఇండోనేషియా తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు..

ఇండోనేషియా తీర ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది..

భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. ఈ నేపథ్యంలో జపాన్ వాతావరణ శాఖ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వేలాది మంది తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. వివరాలు… తూర్పు ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపం సమీపంలో శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది. ఈ భూకంప కేంద్రం ఫ్లోరెస్ ద్వీపం ఉత్తర తీరానికి దూరంగా, ఎండే నగరానికి వాయువ్యంగా సుమారు 68 కిలోమీటర్ల (42 మైళ్ల) దూరంలో ఉందని పేర్కొంది

యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4:58 గంటల సమయంలో భూమి కంపించగా.. భూకంప కేంద్రం సముద్రగర్భంలో సుమారు 35 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రధాన భూకంపం అనంతరం కనీసం మూడు ఆఫ్టర్‌షాక్స్ సంభవించినట్లు సమాచారం. దీంతో ఇండోనేషియా భూభౌతిక సంస్థ (BMKG) అప్రమత్తమై.. కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
భూకంపం కారణంగా ఇప్పటివరకు జరిగిన ఆస్తి నష్టం, ప్రాణనష్టంపై పూర్తి వివరాలు వెల్లడికాలేదు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
మరోవైపు, ఈ భూకంపం కారణంగా ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం, ద్వీపాలు లేదా ప్రాదేశిక ప్రాంతాలకు సునామీ ముప్పు లేదని ఆస్ట్రేలియా సునామీ హెచ్చరిక కేంద్రం స్పష్టం చేసింది.
సముద్రంలో సంభవించిన ఈ భారీ ప్రకంపనలతో ఇండోనేషియా తీర ప్రాంతాల్లో తీవ్ర కలకలం నెలకొంది.