international/us-house-advances-bill-trump-impose-tariffs-india-over-russian-oil
భారత్‌కు మళ్లీ ట్రంప్ షాక్.. ఏకంగా 100 శాతం సుంకాలు.. !
కీలక బిల్లుకు సభ ఆమోదం?
గతేడాది జనవరిలో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. భారత్, చైనా, కెనడా, మెక్సికో ఇలా పలు దేశాలపై ఎడాపెడా సుంకాల్ని విధించారు. అప్పటికప్పుడు పెంచడం, వెంటనే కాస్త తగ్గించడం, అంతా బాగుందనుకునేలోపే మరో రూపంలో బెదిరించడం, వెంటనే మాట మార్చడం అలవాటుగా మారింది. ఈ క్రమంలో భారత్‌పైనా సుంకాల్ని పెంచడం, రష్యా చమురు, గ్యాస్ కొంటున్నారన్న కారణంతో ప్రతీకార సుంకాలు పెంచడం, మళ్లీ తగ్గించడం కూడా జరిగింది. ఇక ఇప్పుడు మరోసారి భారత్‌ను ట్రంప్ సర్కార్ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న భారత్ సహా మరికొన్ని దేశాలపై భారీగా టారిఫ్స్ విధించేందుకు అవకాశం కల్పించే అమెరికాలో ఓ బిల్లు అత్యంత కీలక ప్రక్రియకు చేరుకుంది.
ఇక్కడ బిల్లును ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికా హౌస్‌లో మంగళవారం విధానపరమైన ఓటింగ్ నిర్వహించగా ఇక్కడ 214-211 తేడాతో అనుకూలంగానే నిర్ణయం వచ్చింది. దీంతో బిల్లుపై పూర్తి స్థాయి ఓటింగ్‌కు మార్గం సుగమమైంది. ఈ బిల్లు ఇదివరకే సెనేట్‌లో 86-11 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఇప్పుడు ప్రతినిధుల సభలో కూడా ఆమోదం పొందితే తదుపరి దశకు వెళ్లనుంది. అప్పుడు సుంకాల ప్రభావం భారత్‌పైనా పడే ప్రమాదం పొంచి ఉంది.
లిస్టులో భారత్, చైనా సహా మరికొన్ని దేశాలు
గతంలో సెనేట్ ఆమోదించిన బిల్లులో రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతి చేసుకునే ప్రధాన దేశాలపై 100 శాతం వరకు సుంకాలు ఉంటాయని మెన్షన్ చేయగా ఇప్పుడు మరింత క్లారిటీగా పేర్కొన్నారు. ఇందులో భారత్, చైనా, తుర్కియే, హంగేరీ, అజర్ బైజాన్, సింగపూర్, యూఏఈ, కిర్గిజిస్థాన్, కజకిస్థాన్, స్లొవేకియా వంటి దేశాలు ఉన్నాయని తెలిపారు.