తల్లి, బంధువులు వివిధ కోర్టుల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. చివరకు ఒక రోజు ఆ తల్లికి వచ్చిన ఫోన్ కాల్ ద్వారానే వారు జైలులో మగ్గిపోతున్న విషయం వెలుగులోకి వచ్చింది…జనవరిలో ఇరాన్లో నిత్యావసరాల ధరలు పెరగడంతో, ద్రవ్యోల్బణాన్ని తట్టుకోలేక ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. అయితే, ఈ నిరసనలను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తీవ్రంగా అణచివేసింది. వందలాది మందిని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడంతో పాటు కొందరికి మరణశిక్షలు కూడా విధించింది..
ఈ క్రమంలోనే 19 ఏళ్ల కవల సోదరీమణులకు ఇరాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన శిక్షలు ఖరారు చేసింది. జైల్లో వారిపై సాగించిన దారుణ హింస ఎంతలా ఉందంటే, చిత్రహింసల కారణంగా కనీసం తమ సొంత కూతుళ్లను కూడా వారి తల్లి గుర్తుపట్టలేకపోయారు. ఇరాన్ పాలకుల ఈ అణచివేత చర్యలపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇరాన్ కోర్టు దారుణ శిక్షలు!
నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలతో 19 ఏళ్ల కవల సోదరీమణులకు కోర్టు దారుణమైన శిక్షలు ఖరారు చేసింది. తరనే రహీమికి మరణశిక్ష విధించగా, ఆమె కవల సోదరి రొమినా రహీమికి 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. వీరు అరెస్టయ్యే నాటికి ఇంకా హైస్కూల్ విద్యార్థినులే కావడం గమనార్హం. ‘ది గార్డియన్’ కథనం ప్రకారం.. ఈ అరెస్ట్ వెనుక అత్యంత భయానక వాతావరణం నెలకొంది.