నిన్నటి వరకూ యుద్ధానికి మేం రెడీ అంటే మేమూ రెడీ అన్నట్లుగా సాగింది ఇరాన్, అమెరికా మధ్య పరిస్థితి. అయితే ఇదంతా ఖమేనీ సర్కార్ అక్కడ నిరసనలు చేపడుతున్న ప్రజలపై కాల్పులు జరపటం, వారిలో కొందరికి ఉరిశిక్షలు వేయనున్నట్లు ప్రకటించటమే. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ దీనిని పూర్తిగా వ్యతిరేకించారు. శాంతి యుతంగా నిరసనలు తెలుపుతున్న ప్రజలపై దాడులు ఆపాలని ఖమేనీ ప్రభుత్వానికి అల్టిమేటం కూడా పంపారు. ఈ క్రమంలోనే ఇరాన్ అమెరికా దాడులను ఎదుర్కోవటానికి సిద్ధం కావటంతో పాటు తన గగనతలాన్ని క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనంతటికీ ఆజ్యం పోసిన విషయం నిరసనకారుడు ఇర్ఫాన్ సొల్తానీని ఇరాన్ ఉరితీయనుందనే విషయమే. తాజా పరిణామాలతో దీనికి బ్రేక్ పడిందని తెలుస్తోంది. .
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ఇరాన నిరసనకారులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అయితే వాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని.. అవసరమైతే సైనిక చర్యలకు దిగుతామని ఖమేనీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అవసరమైన సాయం పంపిస్తాం అంటూ ఆందోళనలను ప్రొత్సహిస్తున్నారు. అయితే కఠిన మార్గాలు ఆయన ఉద్దేశాలు కావని.. ఏదైనా సామరస్యంగా పరిష్కారం కావాలనే కోరుకుంటున్నారని వైట్ హౌస్ ప్రతినిధి కరోలైన్ లేవిట్ విరుద్ధమైన ప్రకటన చేయడం గమనార్హం..
ఇదిలా ఉంటే.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి సైతం ఈ విషయంలో కీలక ప్రకటన చేశారు. నిరసనలతో సంబంధం ఉన్నవాళ్లకు మరణదండనలు అమలు చేయాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. వాళ్లను ఉరి తీసేందుకు ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేయలేదు అని ఆయన ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, ఇరాన్ న్యాయవ్యవస్థ మాత్రం వేగంగా విచారణలు జరిపి శిక్షలు అమలు చేయాలని చూస్తోంది..